మంత్రి ఇలాకాలో ఇసుక దందా | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో ఇసుక దందా

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

కాపలా కాసి ఫొటోలు తీయండి

రాత్రి వేళల్లో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా

పెన్నా పొర్లు కట్ట ప్రాంతం నుంచి మంత్రి పేరు చెప్పి తరలింపు

మంత్రికి 48వ డివిజన్‌ ఇన్‌చార్జి ఫిర్యాదు

నెల రోజులుగా నడుస్తున్న

ఇసుక దందా

మంత్రి అనుచరుడు పట్టాభి కీలకం

మంత్రికి ఫిర్యాదు చేసిన ఇసుక దందా వాయిస్‌ వైరల్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఇసుక దందా నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పెన్నా నది నుంచి భారీ స్థాయిలో ఇసుక తరలించి తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. నగరంలోని పెన్నా పొర్లు కట్ట ప్రాంతంలో భారీ యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెన్నానదిలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పర్యావరణ కోసం ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. అయినప్పటికి మంత్రి అనుచరులు ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. మంత్రి నారాయణ తన ఎన్‌ టీం, డివిజన్‌ నాయకులతో శుక్రవారం ఫోన్‌ కాల్‌ మాట్లాడుతున్న సమయంలో 48వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మాట్లాడుతూ మీ పేరు చెప్పి ఇసుక దందా చేస్తున్నట్లు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆ ఆడియో వాయిస్‌ సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.

మంత్రి పేరు చెప్పి..

నగరంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఉన్న పొర్లుకట్ట ప్రాంతంలో ఇసుక దందా నిర్వహిస్తున్నారు. మంత్రి అనుచరుడు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ వేమిరెడ్డి పట్టాభి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని మంత్రి అనుచరులు ఆయనకు ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుక రవాణా సాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పెన్నానదిలో నిషేధం ఉన్నప్పటికి యంత్రాలు పెట్టి తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. స్థానికంగా స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి టిప్పర్లకు లోడింగ్‌ చేస్తున్నారని భారీ వాహనాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి తనకు ఇసుక దందా నడుపుతున్న విషయం తెలియదని, నా పేరు వాడుకుని పట్టాభి ఆయన పేరు చెప్పుకుని కృష్ణయాదవ్‌ ఇలా దందా చేస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక దందా చేస్తే ఫొటోలు తీసి తనకు పంపమనడంపై నేతలు పెదవి విరిచారు. నెల రోజులుగా దందా నడుస్తుంటే మంత్రికి తెలియదా? అంటూ నిట్టూర్చారు.

ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మంత్రికి ఫిర్యాదు చేస్తే రాత్రి వేళల్లో కాపలా కాసి ఫొటోలు తీసి పంపమని మంత్రి చెప్పడంపై సర్వత్రా విస్మయానికి గురి చేసింది. గతంలో 3వ డివిజన్‌ దీనదయాళ్‌నగర్‌ ప్రాంతంలో ఇసుక దందా జరుగుతుంటే నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాత్రివేళ కాపలా కాసి ఫొటోలు తీశాడని, అలాగే మీరు చేయాలని మంత్రి చెప్పడంపై నేతలు నోరెళ్లబెట్టారు. అక్రమ రవాణా అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి కానీ కాపలా కాసి ఫొటోలు తీయమనడం ఏమిటని మంత్రి తీరుపై స్థానిక టీడీపీ నేతలే మండి పడుతున్నారు. ఇసుక దందా విషయంలో తనకు చెడ్డ పేరు వస్తుందని సంతపేట సీఐకు ఫోన్‌ చేసి, టిప్పర్లతో ఇసుక తరలిస్తే సీజ్‌ చేయాలని, ట్రాక్టర్లతో అయితే వదిలేయాలని చెప్పడం కొసమెరుపు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement