జిల్లాలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇలా..

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

మందకొడిగా ప్రక్రియ

35 శాతం సైతం కాని డిజిటలైజేషన్‌

జాప్యంపై డీఆర్వోకు మాజీ మంత్రులు కాకాణి, నల్లపరెడ్డి ఫిర్యాదు

వ్యవహారంలోకి చొరబడిన పచ్చ నేతలు

జలదంకిలో దొంగ ఓట్ల కోసం తప్పుడు సమాచారం

బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం గందరగోళంగా మారుతోంది. ఈ ప్రక్రియతో తమ ఓటు ఉంటుందా.. ఊడుతుందాననే ఆందోళన ఎంతో మందిలో నెలకొంటోంది. ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. మరో పది రోజుల్లో గడువు ముగియనుండటంతో ఆలోపు ఇది సాధ్యమేనాననే ప్రశ్న పలువురిలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలోకి టీడీపీ నేతలు చొరబడి దొంగ ఓట్లను నమోదు చేయించే కుట్రకు తెరలేపారు. జలదంకిలో సాగుతున్న ఈ ఉదంతాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బట్టబయలు చేశారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా, డిజిటలైజేషన్‌ అంశంలో గందరగోళం నెలకొంది. మరోవైపు బీఎల్వోలకు అదనపు బాధ్యతలను అప్పగించడంతో ఒత్తిడి పెరిగి కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఈ వ్యవహారంపై డీఆర్వోకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతల కనుసన్నల్లో..

టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో సాగే ఈ ప్రక్రియను పారదర్శకంగా జరపాల్సి ఉన్నా, నిబంధనలను కాలరాయడంపై ప్రతిపక్ష పార్టీల్లో ఆందోళన నెలకొంది.

35 శాతం కాని డిజిటలైజేషన్‌

కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల పరిధిలోని 19,21,131 ఓటర్లకు గానూ 99 శాతం మేర ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్వోలు పంపిణీ చేశారు. అయితే దాదాపు 35 శాతం డిజిటలైజేషన్‌ సైతం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ నెల 14 వరకు గడువుండటంతో ఆలోపు మిగిలిన మేర నమోదు చేయడం కష్టమేననే భావన రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది.

దొంగ ఓట్లు చేర్చేందుకు కుట్ర

ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలసెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్వో కుమ్మకై ్క అక్కడ 76 ఓట్లున్నాయని చూపారు. దొంగ ఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వ్యవహారం బట్టబయలైంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్‌ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

నియోజకవర్గం ఓటర్లు పంపిణీ చేసిన శాతం డిజిటలైజ్‌ శాతం ఫారాలు అయినవి

కావలి 2,41,702 2,30,466 95.35 1,01,617 42.04

ఆత్మకూరు 2,17,309 2,12,845 97.95 98,668 45.40

కోవూరు 2,69,146 2,63,140 97.77 1,07,731 40.03

నెల్లూరు సిటీ 2,39,870 2,36,478 98.59 82,106 34.23

నెల్లూరు రూరల్‌ 2,82,312 2,72,581 96.55 93,609 33.16

సర్వేపల్లి 2,34,393 2,29,712 98.00 92,143 39.31

గూడూరు 2,46,086 2,45,753 99.86 80,361 32.66

ఉదయగిరి 2,43,422 2,37,157 97.43 1,03,339 42.45

మొత్తం 19,74,240 19,28,132 97.66 7,59,574 38.47

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement