● గిరిజన మహిళను వివస్త్రను చేసిన కేసును నీరుగార్చే కుట్రను సహించం
● ఎస్టీ మహిళను బీసీ – ఈగా మార్చి
అట్రాసిటీ కేసు లేకుండా చేసే పన్నాగం
● మహిళలకు పట్టిన పీడ
దుర్యోధన దండు, దుశ్శాసన సేన
● ఈ కేసు విషయంలో అన్యాయం చేస్తే ఆదివాసీల ఆగ్రహం తప్పదు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో టీడీపీ నేతలు అధికార మదంతో గిరిజన మహిళను వివస్త్రను చేసి అమానవీయంగా కొట్టారని, ఈ ఘటన జరిగి రెండు వారాలైనా అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు పోలీసులు నిందితులను రక్షించే పాత్ర పోషిస్తున్నారని, ఇది ముమ్మాటికి సర్కారు దాష్టీకమేనని ఆదివాసీ నాయకులు మండి పడ్డారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఎరుకుల సేవా సంఘ అధ్యక్షుడు దేవరకొండ శంకరరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడా పోతురాజు, వైస్ ప్రెసిడెంట్ కుంభా వెంకటకోటయ్య, అధికార ప్రతినిధి దాసా సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సోగాల ఆనంద్, మహిళా కమిటీ సభ్యురాలు దేవరకొండ రమణి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నాయుడు మునిరాజు, కమిటీ సభ్యులు సురేష్, దేవరకొండ ప్రసాద్ తదితరులు బాధిత మహిళ నివాసానికి చేరుకుని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఎటువంటి అన్యాయం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేవరకొండ శంకరరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఎక్కడొక చోట మహిళలు, చివరికి పసిపిల్లలపైనా అత్యాచారాలు, హత్యలు, మృతదేహాలు కనపడకుండా చేయడాలు, వారిని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యలు చేసుకునే విధంగా కొట్టడాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఒక దుర్యోధన దండు, ఒక దుశ్శాసన సేన మహిళలకు పట్టిన పీడ అన్నారు. ఒక దుశ్శాసనడు ఒక ఎస్సీ మహిళను నడిరోడ్డు మీద అమానవీయంగా అవమానించినా ఇంత వరకు చర్యల్లేవన్నారు. తిరుపతిలో ఒక దుశ్శాసన సైనికుడు ఒక మహిళను వేధించి వెంటాడి వెంటాడి ఆమె డబ్బును, ఆస్తిని కూడా స్వాధీనం చేసుకొని ఆమె మీదే తిరిగి కేసు పెట్టారన్నారు. మంగమ్మ, కళావతి, తిరుపతమ్మ, ఇప్పుడు ఈమె. ఇట్లా అనేక మంది మహిళలను ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారికి భద్రత లేకుండా చేస్తున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడా పోతురాజు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఎరుకల సేవా సంఘం నాయకులందరూ కావలిలో జరిగిన అమానుషమైన ఘటనలో బాధితురాలికి అండగా ఉండేందుకు వచ్చామన్నారు. టీడీపీ నేతలు ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించి, కులం పేరుతో దూషించి, వివస్త్రను చేసి కొట్టిన ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిజన మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. గత నెల 19న కావలిలో గిరిజన మహిళ ఘటన జరిగితే.. పోలీసులు వారం రోజుల పాటు కేసు నమోదు చేయకపోవడం, కేసు నమోదు చేశాక తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ బీసీఈగా, ఒక మైనార్టీ ముస్లింగా చిత్రీకరించడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చే కుట్రగా కనిపిస్తుందన్నారు. చట్టాలేం తేలిగ్గా లేవు, ఎవరూ కూడా ఊరుకునే పరిస్థితి లేదు, సమాజం చూస్తా ఊరుకోదు. ఎరుకలుగా తామంతా ఆమెకు మద్దతు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఒక ఎరుకల మహిళను ఈ రకంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి, సెంట్రల్ కమిషన్ నుంచి కూడా నోటీసులు అందుకుంటారని హెచ్చరించారు.


