వెంగమాంబ..వలసవాసుల ఆరాధ్య దైవం | - | Sakshi
Sakshi News home page

వెంగమాంబ..వలసవాసుల ఆరాధ్య దైవం

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

రేపట్నుంచి ఐదురోజులపాటు బ్రహ్మోత్సవాలు

లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

ఏర్పాట్లు పూర్తి

దుత్తలూరు: వలసవాసుల ఆరాధ్య దైవంగా, భక్తుల కొంగు బంగారంగా పేరొందిన వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మండలంలోని నర్రవాడలో వెలసిన అమ్మవారి ఆలయంలో ఆదివారం నుంచి ఐదురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సాధారణంగా అత్యధిక సార్లు జూన్‌ నెలలోనే నిర్వహిస్తారు. అయితే ఈసారి అధిక జ్యేష్ట మాసం రావడంతో ఉత్సవాలు జూలై నెలలో నిర్వహించాల్సి వస్తోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ధర్మకర్తల మండలి, దేవదాయ శాఖ, ఇతర శాఖల అధికారులు తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిరోజు నిలుపు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. సంతానం లేని మహిళలు సంతాన ప్రాప్తి కోసం అదేరోజు అమ్మవారిని ప్రార్థిస్తూ వరబడతారు.

ఉత్సవాలు ఇలా..

6న వెంగమాంబ, గురవయ్య నాయుడు దంపతుల గ్రామోత్సవం, 7న గ్రామోత్సవం నిర్వహిస్తారు. 8న ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం, పసుపు, కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రదానోత్సవం జరుగుతాయి. 9న భక్తుల పొంగళ్ల కార్యక్రమం, ఎడ్లబండలాగు పందేలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేయగా, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.

ప్రస్తుత ఆలయంలో చివరిసారిగా..

వెంగమాంబ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.12 కోట్ల ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికే రూ.6 కోట్లు మంజూరై టెండర్ల దశలో ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని తొలగించనున్నారు. దీంతో ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement