ఉదయగిరి: కూటమి ప్రభుత్వంలో అవినీతి జడలు విప్పి నాట్యం చేస్తోంది. ప్రభుత్వ పెద్దలు తమ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండగా, కొందరు అధికారులు తామేమీ తక్కువ కాదన్నట్లు అందినకాడికి దోచుకుంటున్నారు. గత నెల మొదటి వారంలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ఆరు రోజులపాటు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో (నెల్లూరులో రెండు కేంద్రాలు, వెంకటాచలం, రావూరు, కావలి, వింజమూరు, గూడూరు, ఆత్మకూరు, కోవూరు) జరిగిన ఈ శిక్షణలో రోజూ సుమారు 2,500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారికి భోజనం, టిఫిన్, టీ, స్నాక్స్ తదితర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున కేటాయించింది. ఈ నిర్వహణ బాధ్యతలను సమగ్రశిక్షలోని ఓ ముఖ్య అధికారి తనకు అనుకూలమైన ఏజెన్సీలకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి.
భోజనంలో చేతివాటం
జిల్లాలో శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రోజుకు సుమారు రూ.7.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే అందులో సగం కూడా ఖర్చు చేయకుండా నాసిరకం భోజనం, స్నాక్స్ సరఫరా చేసి మిగిలిన మొత్తాన్ని కాజేశారనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీలు కేవలం ఒక్కొక్కరికి రూ.150 మాత్రమే ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ శిక్షణ కార్యక్రమాలకు మొత్తం రూ.50 లక్షలు కేటాయించగా, అందులో సుమారు రూ.25 లక్షల వరకు చేతివాటం చూపినట్లు టీచర్లు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం అంతా సమగ్రశిక్షలోని ఓ అధికారికి తెలిసే జరిగిందని, ఇందులో అధిక శాతం వాటా ఆయనకే వెళ్లిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
వింజమూరులో నిరసన
వింజమూరులో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజే భోజనం, స్నాక్స్ నాణ్యతపై టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండో రోజు నుంచి స్థానికంగా ఉన్న ఓ వంట మాస్టర్‌కు ఒక్కో వ్యక్తికి రూ.150 చొప్పున చెల్లించి భోజనం, టీ, స్నాక్స్, టిఫిన్ సరఫరా చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా అన్ని శిక్షణ కేంద్రాల్లో ఇదే తరహాలో చేతివాటం జరిగినట్లు పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
అవినీతి మరక
జిల్లాలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న, గతంలో జరిగిన పలు పనుల్లోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల వింజమూరు మండలం నల్లగొండ్ల, శంఖవరం ప్రాథమిక పాఠశాలల ప్రహరీకి సంబంధించి పనులు చేయకుండానే రూ.21.89 లక్షల నిధులు కాజేసిన వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ కొనసాగుతోంది. ఇవే కాకుండా మరిన్ని అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాల్లో ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు ముఖ్య అధికారి పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలు అధికార వర్గాలకు తెలిసినా ‘తమకెందుకులే’ అన్న ధోరణితో వ్యవహరిస్తుండటమే అవినీతికి మరింత ఊతమిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎఫ్‌ఎల్‌ఎన్ ట్రైనింగ్‌లో చేతివాటం?
స్నాక్స్, భోజన ఏర్పాట్లలో కక్కుర్తి
నాసిరకంగా సరఫరా చేసి
రూ.25 లక్షల స్వాహా?
ఏజెన్సీల పేరుతో వెండర్ నియామకం
చేతివాటంలో ముఖ్య అధికారి
పాత్రపై ఆరోపణలు


