కారులో మంటలు | - | Sakshi
Sakshi News home page

కారులో మంటలు

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

తప్పిన ప్రమాదం

వెంకటాచలం: వేగంగా వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటన శుక్రవారం వెంకటాచలం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గూడూరుకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు కారులో మైపాడు బీచ్‌కు వెళ్లారు. తిరిగి సొంతూరికి వస్తుండగా వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపానికి చేరుకోగానే కారులో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారును రోడ్డుపక్కన నిలిపివేశాడు. టోల్‌ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి కారులో ఉన్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఆవును కాపాడిన స్థానికులు

సంగం: మండలంలోని సంగం బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలోని కాలువలో ప్రమాదవశాత్తు పడిన ఆవును స్థానికులు సురక్షితంగా బయటకు తీసిన ఘటన శుక్రవారం జరిగింది. ఆవు పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే తాళ్లు తీసుకొచ్చారు. మూగజీవానికి కట్టి, ఎంతో శ్రమించి పైకి లాగారు.

సీహెచ్‌సీలో నిధుల స్వాహాపై విచారణ

వెంకటాచలం: మండలంలోని వెంకటాచలం క్లస్టర్‌ ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో నిధుల స్వాహా జరిగాయనే ఆరోపణలపై శుక్రవారం రాష్ట్రస్థాయి ప్రత్యేక కమిటీ బృందం విచారణ చేపట్టింది. పరికరాల కొనుగోలు, వివిధ అభివృద్ధి పనుల పేరుతో డబ్బు దుర్వినియోగం చేసినట్లు కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. మే నెలలో జిల్లా స్థాయి అధికారులు విచారణకు వచ్చారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు సహకరించకపోవడంతో ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి ప్రత్యేక కమిటీచే విచారణకు ఆదేశించారు. దీంతో తాడేపల్లిలోని డీఎస్‌హెచ్‌ కార్యాలయం నుంచి ముగ్గురు అధికారులు, నెల్లూరులోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయం మరొక అధికారి విచ్చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీహెచ్‌సీలో జరిగిన పనుల గురించి సిబ్బందితో మాట్లాడి పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని విచారించారు. అతని వద్ద ఉన్న పలు రికార్డులను పరిశీలించారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.50

సన్నవి : రూ.20

పండ్లు : రూ.10

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement