● ఆశల్ని చిదిమేసిన ఘోర రోడ్డుప్రమాదం
కోట: రోడ్డు ప్రమాదం రెండు పేద కుటుంబాల్లో చీకట్లు నింపింది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న ఇద్దరు స్నేహితులు విగతజీవులుగా మారడం అందరిన్నీ కంటతడి పెట్టించింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ప్రధాన రహదారిపై గురువారం రాత్రి మృత్యుశకటంలా దూసుకొచ్చిన గాయత్రి రొయ్యల కంపెనీ బస్సు చక్రాల కింద సంగారపు శివకుమార్ (21), కలివేల శ్రీనాథ్(21) నలిగి ప్రాణాలొదిలారు. కేసవరం గ్రామానికి చంద్రయ్య, లక్ష్మమ్మ నిరుపేద వ్యవసాయ కూలీలు. వారి కుమారుడైన శివకుమార్ ఏఎంఆర్ సంస్థలో పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా ఉన్నాడు. అదేవిధంగా వంజివాకకు చెందిన కరివేల రమణయ్య, కోటమ్మ దంపతుల కుమారుడైన శ్రీనాథ్ ఏఎంఆర్ సంస్థలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు.
వాటర్ క్యాన్ కోసం వెళ్లి..
ఊనుగుంటపాళెంలో ఉన్న ఏఎంఆర్ చెక్‌పోస్ట్ వద్ద గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లిన శివకుమార్, శ్రీనాథ్ వాటర్ క్యాన్ తీసుకెళ్లేందుకు చంద్రశేఖరపురానికి వచ్చి రోడ్డు పక్కన నిలిబడి ఉన్నారు. వేగంగా దూసుకొచ్చిన రొయ్యల కంపెనీ బస్సు ముందు ట్రక్కు ఆటోను ఢీకొట్టి, రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరి మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శుక్రవారం అక్కడ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ వెంకటరమణయ్య కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


