● బిడ్డలకు భోజనం తీసుకెళ్తూ..
● ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
పొదలకూరు: భార్య మధ్యాహ్న భోజనం వండి పిల్లల కోసం క్యారేజీ సిద్ధం చేసి భర్తకు ఇచ్చింది. అతను పట్టణంలో చదువుతున్న తన బిడ్డల వద్దకు మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూసింది. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. నాన్న వస్తాడని ఎదురు చూస్తున్న పిల్లలకు కన్నీరే మిగిలింది. ఈ ఘటన మండలంలోని ఇనుకుర్తి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొదలకూరుకు సమీపంలోని డేగపూడి గ్రామానికి చెందిన టి.రవీంద్ర (42) వ్యవసాయంతోపాటు పట్టణంలోని ట్రాక్టర్ల ట్రక్కులు తయారు చేసే కంపెనీలో పనిచేస్తుంటాడు. పొదలకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో అతని కుమార్తె టెన్త్, కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. వారికి మధ్యాహ్న భోజనం అందజేసేందుకు డేగపూడి నుంచి పొదలకూరుకు మోటార్‌బైక్‌పై రవీంద్ర బయలుదేరాడు. ఇనుకుర్తి గ్రామం పెట్రోలు బంక్ వద్ద రాపూరు డిపోకి చెందిన రాజంపేటకు వెళ్లే బస్సు రవీంద్ర బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి వృద్ధిలోకి తీసుకురావాలని రవీంద్ర తపించేవాడు. అతను పట్టణంలో అందరికీ సుపరచితుడు కావడంతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పొదలకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై హనీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించారు. ఆర్టీసీ బస్సును స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.


