మహిళపై ఘోర అఘాయిత్యం | - | Sakshi
Sakshi News home page

మహిళపై ఘోర అఘాయిత్యం

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

– కాకాణి గోవర్ధన్‌రెడ్డి

రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు భద్రత లేదని, అధికారం అండతో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారని, రెండేళ్లుగా ఎంతో మంది బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగినా.. ఒక్కరిపైనా ఇంత వరకు చర్యలు లేవని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై కూటమి నాయకులే అఘాయిత్యాలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చూస్తూ ఉండిపోతున్నారని ధ్వజమెత్తారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా యాప్‌ తెచ్చి, మహిళలకు రక్షణ కల్పించడంతోమహిళల వైపు చూడాలంటే భయపడేవారన్నారు. ఒక మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి అత్యంత పాశావికంగా టీడీపీ మాజీ కౌన్సిలర్‌, ఆయన వర్గీయులు దాడి చేస్తే రెండు వారాలైనా చర్యలు చేపట్టకపోవడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఘోర అవమాన భారంతో బాధితురాలు కుంగిపోతుంటే.. ఆమె సామాజిక హోదాపై కూడా ప్రశ్నలు లెవనెత్తడం బాధాకరమన్నారు. ఆమె ఏ సామాజిక వర్గమైనా మహిళనే కదా? అని ప్రశ్నించారు. ఈ దుస్సంఘటనపై పట్టణంతోపాటు జిల్లా మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుంటే బాధితుల్ని ఏదో రకంగా బెదిరించి కేసును ముందుకు సాగకుండా చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించారన్నారు. జన్మతః ఏదైతే కులంలో పుడుతామో అదే కొనసాగుతుందని మనం మారమంటే మారదని విశదీకరించాడు. పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. గిరిజన మహిళకు జరిగిన అన్యాయం కోణంలో తామంతా పోరాడుతున్నామన్నారు.

– గుండా సురేంద్రబాబు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు

ఒక గిరిజన మహిళను నిర్బయంగా వివస్త్రను చేసి విచక్షణారహితంగా కొట్టాగలిగారంటే.. అధికార బలంతోనే ఈ దురాగతానికి తెగించారని ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ గుండా సురేంద్రబాబు దుయ్యబట్టారు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పలేక చెబుతుంటే అందరి కళ్లు చెమర్చాయన్నారు. గిరిజన మహిళకు తామంతా అండగా ఉంటామని, తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చామన్నారు. ఈ ఘటనపై కావలి పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించిన తీరు ఆక్షేపణీయమన్నారు. రాష్ట్ర హోమంత్రి అనిత మౌనం వహించడం శోచనీయమన్నారు. గిరిజన సంక్షేమశాఖా మంత్రి ఉన్నా లేనట్టేనని ఆమెను గూర్చి మాట్లాడడం సమయం వృథా చేయడమేనన్నారు. ఈ రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఈ రోజు కావలిలో జరిగిన దారుణం ఒకటైతే.. సర్వేపల్లి ని యోజకవర్గంలో ఒక గిరిజనుడిని పీక కోసే దారుణానికి తెగించారన్నారు. సుగాలిప్రీతి విషయం కావొచ్చు... అనంతరపురంలో ఒక ఇంటర్మీడియట్‌ అమ్మాయిని చంపేశారన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదన్నారు. శాంతిభద్రతల్లో పూర్తిగా విఫలమయ్యారన్నారు.

ఎస్టీ, మానవహక్కుల కమిషన్లకు,

రాష్ట్రపతికి ఫిర్యాదులు చేస్తాం

న్యాయపోరాటం ద్వారా బాధ్యుల భరతం పడతాం

పోలీసులకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాస్‌ వార్నింగ్‌

నేరస్తులకు కాపు కాయడం సిగ్గుచేటు

– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి చరిత్రలో ఒక మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పన ఇంతటి దారుణమైన, జుగప్సాకరమైన ఘటన ఏ రోజు జరగలేదని, ఒక గిరిజన మహిళను వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా కొట్టిన నిందితులకు ఎమ్మెల్యే కాపు కాయడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ఘటన జరిగి రెండు వారాలవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో నిందితులు కాలరేగరేసుకుని తిరుగుతున్నారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దానికి కారణం ఇక్కడి రాజకీయ నాయకులే అని స్పష్టం చేశారు. ఆ గిరిజన మహిళకు జరిగింది ముమ్మాటికి ఘోర అవమానమే అని, ఈ తరుణంలో ఎమ్మెల్యే పరామర్శించి, అండగా ఉండాల్సింది పోయి.. రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇక్కడి పోలీసులు కూడా నేరస్తులకు కొమ్ముకాయడం విస్మయం గొలుపుతుందన్నారు. కనీసం మంచి చేయడం పోయి ద్రోహం చేయడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ఇటువంటి దురదృష్టకరమైన ఘటనపై కొంతమంది మీడియా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు రాయడం బాధాకరమన్నారు. మైనార్టీలకు ఇక్కడ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, ఒక గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు. ఒక వేళ ఆ మహిళ కుమారుడు తప్పు చేసి ఉంటే దానిపై చట్టప్రకారం వెళ్లాలే కానీ, తల్లిపై విచక్షణారహితంగ దాడికి దిగడం మానవత్వమా అని ప్రశ్నించాడు.

అధికార బలంతోనే ఈ దురాగతం

కేసును నీరుగార్చే కుట్రపై జాతీయస్థాయి పోరాటం

– ఎమ్మెల్సీ కుంభా రవిబాబు

కావలిలో జరిగిన దుస్సంఘటన యావత్‌ రాష్ట్రాన్ని విస్మయం కలిగించేదని, ఇలా దురదుష్టకరమైన దారుణమని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును తొక్కిపెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యే, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత గర్హనీయమన్నారు. ఈ కేసును నీరుగార్చే కుట్రపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. గత నెల 19న ఈ ఘటన జరిగినా ఈ నాటికి నిందితులపై ఎటువంటి చర్యల్లేవన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీంను ఏ–1గా చేర్చాల్సి పోలీసులు ఏ–6గా నమోదు చేయడం ఎవరి ప్రమేయంతో జరిగిందో అర్థమవుతుందన్నారు. ఈ దురాగతంపై వైఎస్సార్‌సీపీ గళమెత్తడంతో హడావుడిగా అట్రసిటీ కేసు నమోదు చేశారన్నారు. బాధితురాలి తండ్రి ఎస్టీ అని అప్పటి తహసీల్దార్‌ ధ్రువీకరిస్తే.. ఆయన కుమార్తె బీసీఈ అని ఇప్పటి తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ సర్టిఫై చేయడం ఏమిటని నిలదీశారు. ఈ ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. తమ పార్టీ తిరుపతి, అరకు ఎంపీలు గురుమూర్తి, గురుమూర్తి, తనూజారాణితోపాటు ముఖ్య నేతలందరం కలిసి జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపడుతామన్నారు.

రాజకీయం, మతపరం చేయకండి

మహిళల రక్షణపై ప్రభుత్వానివి ప్రగల్భాలే

నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

కావలి ఉమెన్‌ ఫోర్స్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి పట్టణలోని కచ్చేరిమిట్టలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం ఘోర అఘాయిత్యమే. ఈ దారుణానికి రాజకీయం, మతపరమైన రంగులు పులమొద్దని కావలి ఉమెన్‌ ఫోర్స్‌ సభ్యులు సీ శారద, జి. లావణ్య, ఎస్‌కే ఫాతిమా, టి. విద్యావతి, ఎస్‌కే నూర్జహాన్‌, ఎం. పార్వతీశంకర్‌, ఎం. కవిత, ఎస్‌. సుహాసిని తదితరులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాధితురాలి కుమారుడు తమ ఆడపిల్లను ప్రేమిస్తున్నాడన్నాడనే కారణంతో ఆరుగురు వ్యక్తులు ఆమెను నడివీధిలోకి లాగి బరితెగించి వివస్త్రను చేసి గాయపడేలా దాడి చేసిన దుస్సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. గత నెల 19వ తేదీ ఈ దారుణం జరిగినా.. వారం క్రితం వెలుగు చూసినా.. అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు తొక్కి పెట్టడం విచారమన్నారు. మహిళల భద్రత తమకు అత్యంత ప్రధానమని ప్రకటించుకున్న ప్రభుత్వం ఎందుకు ఇంత వరకు నిందితులను ఆరుగురిని అరెస్ట్‌ చేసి, కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదని మహిళ తరఫున ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ అమానుషాన్ని దారి మళ్లించే దిశగా రాజకీయ, మతం ముసుగులు వేస్తూ నిందితుల మతస్తులైన మహిళలతో ప్రెస్‌మీట్‌ పెట్టించి రెండు కుటుంబాల సమస్యను రాజకీయం చేస్తున్నారని నిందారోపణలు చేయడం అత్యంత గర్హనీయమన్నారు. ముస్లిం యువతిని గిరిజన యువకుడు ప్రేమించడంలో తప్పు ఏముందని? ఇష్టం లేకుంటే, తమ బిడ్డకే నచ్చ చెప్పుకోవాలే కానీ, కొడుకు ప్రేమించాడని అతని తల్లిపై ఇంతటి అఘాయిత్యానికి దిగడం వెనుక ఎవరి అండ ఉందో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుందన్నారు. మహిళా హోంమంత్రి ఈ అన్యాయాన్ని తెలిసి ఎలా పట్టించుకోకుండా ఉన్నారని నిలదీశారు. స్థానిక ప్రజాప్రతినిధి బాధిత మహిళను పలకరించి ధైర్యం చెప్పి, తక్షణమే ఈ దురాగతానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ తక్షణమే బాధిత మహిళకు అండగా నిలబడుతున్నామని ప్రకటించి, బాధిత మహిళను కలవాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధిత మహిళ వైపు నిలబడి, తక్షణమే నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement