మహిళలపై పేట్రేగిపోతున్న కూటమి నేతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి కచ్చేరిమిట్ట ఘటన లో న్యాయం పక్షాన నిలబడి దోషులను శిక్షిస్తారా? నిందితుల కొమ్ముకాస్తూ దోషులుగా నిలబడతారా? అంటూ పోలీసులకు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్సీ కుంభా రవి బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాస్‌వార్నింగ్ ఇచ్చారు. గిరిజన మహిళను వివస్త్ర చేసి, దారుణంగా కొట్టితే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పాడని పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఎవరైనా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా.. ఆ రోజే వాళ్లకు ఆఖరి రోజు అవుతుందంటూ చంద్రబాబు ఆవేశంగా చెబుతాడని, నిన్న కూడా గూడూరులో ఇదే డైలాగ్‌లు చెప్పాడన్నారు. ఆయన పార్టీ నేతలు అత్యంత దారుణానికి తెగబడితే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ కేసును ఏదో ఒక రకంగా నీరుగార్చేందుకు, నిందితులను కాపాడేందుకు బాధితులనే నిందితులుగా చిత్రీకరించడానికి పోలీసులు బరితెగిస్తున్నారన్నారు. కావలి 24వ వార్డు టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, ఆయన వర్గీయుల చేతిలో సభ్య సమాజం తలదించుకునే రీతిలో అవమానానికి గురైన గిరిజన మహిళను గురువారం పరామర్శించి ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా అండగా ఉండి న్యాయం జరిగే వరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయబ్ రసూల్, నాయకులు ప్రసాద్‌రెడ్డి, కందుర్తి కామయ్య, కనమర్లపూడి వెంకటనారాయణ, కలికి శ్రీనివాసులరెడ్డి, ద్రోణాదుల వెంకట్రావు జంపాని రాఘవులు, ఆకుమాని శ్రీనుబాబు, మహిళా నేతలు పద్మమ్మ, సీతమ్మ, నాగేశ్వరమ్మ, సుమలత, కళ్యాణి, కీర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు.


