నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్విమ్మింగ్ క్రీడాకారుల జట్లను ఆదివారం ఎంపిక చేయనున్నామని స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సనత్‌కుమార్, మధు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ – 1 (ఏ)లో 17 నుంచి 18 ఏళ్లలోపు ఉండి.. 2008 – 09 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. గ్రూప్ – 1 (బీ)కి సంబంధించి 15 నుంచి 16 ఏళ్లలోపు ఉండి 2010 – 11 మధ్య పుట్టిన వారు అర్హులని వివరించారు. గ్రూప్ – 2లో 13 నుంచి 14 ఏళ్లలోపు ఉండి.. 2012 – 13 మధ్య.. గ్రూప్ – 3లో 11 నుంచి 12 ఏళ్లలోపు ఉండి 2014 – 15 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. హాజరయ్యే వారు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డును తీసుకురావాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ, ఆధార్ కార్డుతో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 18, 19వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న 11వ సబ్ జూనియర్స్, జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి ఆక్వాటిక్ పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు.
గ్రూప్ – 2 ప్రిలిమినరీ
పరీక్షలకు ఉచిత శిక్షణ
నెల్లూరు(వేదాయపాళెం): ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించనున్నామని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు వెంకటలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను శోధన్‌నగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్ భవన్‌లో ఈ నెల 17లోపు అందజేయాలని కోరారు. వంద మందికి రెండు నెలల ఉచిత శిక్షణతో పాటు స్టయ్‌పండ్, స్టడీ మెటీరియల్‌ను అందజేయనున్నామని పేర్కొన్నారు. డిగ్రీ మార్కులు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నామని, తరగతులను ఈ నెల 27న ప్రారంభించనున్నామని వివరించారు. వివరాలకు 93815 54779, 93902 39588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
క్రిస్ సిటీలో
త్వరితగతిన పనులు
చిల్లకూరు / కోట: తీర ప్రాంత గ్రామాలైన తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో చేపడుతున్న క్రిస్ సిటీలో పనులను త్వరగా పూర్తి చేసి పరిశ్రమల యాజమాన్యాలకు అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర సెక్రటరీ యువరాజ్ పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో దాదాపు 900 ఎకరాల్లో పనులను చేపడుతుండగా, వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో పనులు సాగడం కష్టతరంగా మారనుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా పూర్తి చేసేందుకు యత్నించాలని సూచించారు. అనంతరం మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్న పనుల వివరాలతో కూడిన మ్యాప్‌ను పరిశీలించి.. పలు మార్పులు, చేర్పులను సూచించారు. గూడూరు ఆర్డీఓ అరుణకుమారి, చిల్లకూరు, కోట మండలాల తహసీల్దార్లు గోపీనాథ్‌రెడ్డి, జేజే రావు, ఆర్‌ఐ పూర్ణ, సర్వేయర్ మల్లికార్జున్, వీఆర్వో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 78,067 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,158 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


