● ఇంటింటికీ వెళ్లాలనే ఆదేశాలు బేఖాతర్
అనుమసముద్రంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు సేకరించి ఓటర్లకు అవగాహన కల్పించాలనే ఉన్నతాధికారులు ఆదేశాలు కొన్ని చోట్ల బేఖాతర్ అవుతున్నాయి. స్థానిక ఏఎస్‌పేట – 1 సచివాలయంలోనే ధ్రువీకరణ ప్రక్రియను బీఎల్వోలు గురువారం నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు అక్కడికి చేరుకున్నారు. తమ పనులను మానుకొని సచివాలయానికి రావాల్సి వస్తోందని, ఇంటింటికీ వచ్చి ఫారాలను సేకరించాల్సిన అధికారులు కార్యాలయంలోనే ప్రక్రియను పూర్తి చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయమై ఇన్‌చార్జి తహశీల్దార్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, సచివాలయానికి ఎవరూ రావాల్సిన అవసరం లేదని, బీఎల్వోలే ఇంటి వద్దకొచ్చి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారని చెప్పారు. ప్రక్రియ ఈ నెల 14న ముగియనుండటంతో కలెక్టర్ ఆదేశాలతో అన్ని శాఖల సిబ్బందిని విధుల్లో వినియోగించుకుంటున్నామని వివరించారు. ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని బదులిచ్చారు.


