●
నెల్లూరు(అర్బన్): జిల్లాకు రెఫరల్ ఆస్పత్రిగా ఉన్న నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో కీలకమైన వైద్య పరీక్షలకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ (డీపీహెచ్‌ఎల్)ను ఆత్మకూరుకు తరలిస్తున్నారు. సిబ్బందితోపాటు యంత్ర పరికరాలను కూడా తీసుకెళ్తుండటంతో పెద్దాస్పత్రిలో రోగులకు అందుతున్న పలు రకాల వైద్య పరీక్షలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
అంత దూరం ఎలా వెళ్లాలి?
2013లో నెల్లూరు మెడికల్ కళాశాల ఏర్పాటు అయినప్పటి నుంచి మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా డీపీహెచ్‌ఎల్ పనిచేస్తోంది. ఇక్కడ రోజూ ఎన్నో రకాల రక్త పరీక్షలు, యూరిన్, బ్లడ్ కల్చర్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డీపీహెచ్ ల్యాబ్‌ను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో భాగంగా ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. దీనిపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము అంత దూరం ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెద్దాస్పత్రిలో కొత్త వసతులు కల్పించకపోగా ఇలాంటి చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖరీదైన పరీక్షలకు బయటకెళ్లాల్సిందే..
పెద్దాస్పత్రిలో రోజూ సుమారు 1,300 నుంచి 1,600 వరకు ఓపీ నమోదవుతోంది. ఇన్‌పేషెంట్లు 500 నుంచి 600 వరకు ఉంటున్నారు. పలు వ్యాధులకు సంబంధించి, ఆపరేషన్ల సమయంలో వైద్యులు అనేక రకాల రక్త పరీక్షలు సూచిస్తుంటారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరోసిస్, డెంగీ (ఎలీసా) వంటి ఖరీదైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ తగ్గకపోతే బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఇవన్నీ ఒకే రోగికి ఒక్కోసారి చేయాల్సి వస్తుంది. బయట చేయించుకోవాలంటే సుమారు రూ.4 వేలకు పైగా ఖర్చవుతుంది. ప్రస్తుతం వై – టెక్ ఆటోమేటిక్ అనే మెషినరీని తరలిస్తుండటంతో ఇలాంటి పరీక్షలన్నీ పేద రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లలో డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పేరుకే పెద్దాస్పత్రిగా ఉన్నా కీలకమైన పరీక్షలు అందుబాటులో ఉండవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏం చెబుతున్నారంటే..
మెడికల్ కళాశాలలు ఏర్పడక ముందు నెల్లూరులో జిల్లా ఆస్పత్రి ఉండేది. ఇదే విధంగా పాడేరు, ఏలూరు, ఒంగోలు ప్రాంతాల్లో కూడా జిల్లా ఆస్పత్రులుండేవి. అప్పట్లో డీపీహెచ్ ల్యాబ్‌ల ద్వారా మైక్రోబయాలజీ పరీక్షలు నిర్వహించేవారు. మెడికల్ కళాశాలలు ఏర్పడిన తర్వాత జిల్లా ఆస్పత్రుల భవనాలు, సిబ్బంది, మైక్రోబయాలజీ ల్యాబ్‌లను వాటికి అనుబంధంగా కొనసాగించారు. కాగా కళాశాల ఏర్పడి 13 ఏళ్ల తర్వాత ల్యాబ్‌ను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు. తరలింపు సమయంలో ఇక్కడ కొత్త మెషినరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయకపోవడం సమస్యగా మారుతోంది. కొత్త సౌకర్యాలు కల్పించకుండానే ఉన్నవాటిని తరలించడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వేలాది మంది వచ్చే పెద్దాస్పత్రిలోనే ఇలాంటి మెషినరీ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని, లేకుంటే రోగులు తీవ్రంగా నష్టపోతారని వారు చెబుతున్నారు.
పెద్దాస్పత్రిలో మైక్రోబయాలజీ
మెషినరీ ఆత్మకూరుకు తరలింపు
డెంగీ, స్క్రబ్, లెప్టోస్పైరోసిస్ వంటి
ఖరీదైన పరీక్షలకు బ్రేక్
ఈ ప్రభుత్వంలో కొత్త సౌకర్యాలు నిల్
ఉన్నవాటికే ఎసరు
ప్రభుత్వం దృష్టికి ఇబ్బందులు
మైక్రోబయాలజీలో ఉన్న మెషినరీని తరలించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇక్కడ కొత్తవి ఏర్పాటు చేశాక తరలించాలని కోరాం. రోగుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
– డాక్టర్ బెన్‌హర్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల


