కూటమి ప్రభుత్వంలోనే విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలోనే విధ్వంసం

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌

చిల్లకూరు: ‘కూటమి ప్రభుత్వంలోనే ప్రకృతి వనరుల విధ్వంసం జరుగుతోంది. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆపాదించేలా సీఎం చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ విమర్శించారు. గూడూరులోని సనత్‌ నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిల్లకూరు మండలానికి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, గత ప్రభుత్వంలో విధ్వంస పాలన కొనసాగిందనడం చూస్తుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోందన్నారు. కూటమి పాలన వచ్చాక నేతలు ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో గుర్తుండిపోయేవి ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశం గర్వించేలా మెడికల్‌ కళాశాలలు, పోర్టులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఒకరిద్దరికి పింఛన్‌ ఇచ్చేందుకు ప్రతినెలా ఎంతమేర ఖర్చు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ సొమ్ము కాదా? ప్రజలపై భారం పడదా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ను ఒక్క నిమిషంలో అరెస్ట్‌ చేస్తామని చంద్రబాబు అన్నారని, అలా జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి పనితీరును మీరే బయట పెట్టారని, అలాగే విద్యాశాఖ మంత్రి పనితీరును కూడా బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

తాగునీరు అందించలేని స్థితిలో..

ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు గూడూరు పట్టణ ప్రజలకు తాగునీటిని పూర్తి స్థాయిలో అందించలేని స్థితిలో నేడు పాలన చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. నెల రోజుల నుంచి సక్రమంగా తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి అరుణకుమారితోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునరావుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ బొమ్మిడి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు షేక్‌ సుభాన్‌, మేధావుల ఫోరం కన్వీనర్‌ నందవరం సుబ్బారావు, నాయకులు డేగపూడి వేణురెడ్డి, డేగపూడి కృష్ణారెడ్డి, మణి, వెంకటేశ్వర్లు, నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement