ఓట్లు తొలగించేందుకు కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఓట్లు తొలగించేందుకు కుట్రలు

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

ముస్లిం, మైనార్టీ విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా

నెల్లూరు(పొగతోట): ముస్లిం, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లు తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ ఓట్ల పరిరక్షణే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ ఓట్ల పరిరక్షణకు ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆయన చేసిన మేలు వల్ల వేలాది మంది మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. గతంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసిన ఎన్‌ఆర్సీ, సీసీఐ వంటి నల్లచట్టాల తరహాలో ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ విషయంపై ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ ఆధార్‌, రేషన్‌కార్డులు, పాస్‌పోర్టు వంటి గుర్తింపు కార్డులు కాదని తల్లిదండ్రుల పాత ఓటు అడగడం సమంజసం కాదన్నారు. ఈ విచిత్ర నిబంధనల వల్ల వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తొలగించారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. తిరుపతిలో జరిగిన క్షేత్రస్థాయి పరిశీలనలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన బీఎల్‌ఏలు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేరన్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు మాత్రమే ఇంటింటికీ వెళ్తూ ఓట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. పీఎం విదేశాలకు వెళ్లినప్పుడు మైనార్టీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ స్వదేశంలో మ్రాతం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14వ తేదీ వరకు ఓట్ల వెరిఫికేషన్‌ అవకాశం ఉందన్నారు. ముస్లింలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం మసీదులు, ఉర్దూ పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నడుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. ఓటు లేనిపక్షంలో వెంటనే వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ హంజా హుస్సేని, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సిద్ధిఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement