నెల్లూరు(అర్బన్): కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు – 2025 అమల్లో భాగంగా ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి సూచించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులతో డీఆర్వో విజయకుమార్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి ఉత్తర్వులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు, సేవా ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. డిప్యూటీ కేడర్‌లో అప్డేట్ ప్యానెల్‌ను తయారు చేయాలని, ఉద్యోగుల సేవా హక్కులకు సంపూర్ణ రక్షణ క ల్పించాలన్నారు. సీనియారిటీని కాపాడాలని, పదోన్నతులకు రక్షణ కల్పించాలని, ఉద్యోగుల అభిష్టాలకు ప్రాధాన్యమిచ్చి కేటాయింపులు జరపాలని కోరారు. తమ అభ్యంతరాలు తెలిపేందుకు తగినంత గడువునివ్వాలని, ఎస్సీ, ఎస్టీ నిష్పత్తి పరిక్షణ జరగాలంటూ తదితర 13 అంశాలను డీఆర్వోకు తెలిపారు. అలాగే సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. డీఆర్వో మాట్లాడుతూ నాయకుల అభిప్రాయాలు కలెక్టర్‌కు తెలిపి ఎవరికీ నష్టం జరగకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తామన్నారు.


