● అడ్డుకున్న అధికారులు
చిల్లకూరు: కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాల పర్వం పెరిగిపోతోంది. గ్రామాలకు సమీపంలో ఉండే అటవీ భూములను సైతం ఆక్రమించేందుకు సిద్ధ పడుతున్నారు. అడ్డుకున్న వారిని బెదిరించి భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిని గురువారం అటవీ అధికారులు అడ్డుకున్న ఘటన మండలంలోని అన్నంబాక సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఊరికి సమీపంలో ఉన్న 112 ఎకరాల అటవీ భూమిలో కొంత భాగంలో ఉన్న చెట్లు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి వదిలేయాలని చెప్పినట్టు తెలిసింది.
ఏకంగా..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడున్న అటవీ భూమిలో గ్రావెల్ తవ్వేందుకు అనుమతి కోసం అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారు. అయితే అటవీ అధికారులు అందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే నాయకులు భూమిని ఏకంగా ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. భూ ఆక్రమణ విషయంపై అటవీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
కండలేరులో 31.89 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 31.89 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


