నెల్లూరు (పొగతోట): చచ్చినా పింఛన్ రాదు.. ఈ వాక్యం చదవడానికి కష్టంగా ఉన్నా, ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకంతో ఇది అక్షర సత్యంగా నిలుస్తోంది. సర్కార్ కొలువుదీరి రెండేళ్లు దాటినా, నేటికీ నూతనంగా ఒక్కటీ మంజూరు చేయలేదు. మరణించిన వారి కుటుంబాల్లో ఎవరికో అరకొరగా మంజూరు చేస్తూ చేతులు దులుపుకొంటోంది. వీటిని కొత్తగా అందుకోవాలనే ఆశతో దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలలుగా నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా 50 వేల మందికిపైగా వెయిట్ చేస్తున్నారంటే సమస్య తీవ్రత ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.
ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ
బీవీనగర్‌కు చెందిన దివ్యాంగుడు రవిశంకర్ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యత్నించినా, ప్రయోజనం శూన్యం. వెంకటేశ్వరపురానికి చెందిన నారాయణమ్మ భర్త మరణించడంతో, పెన్షన్ నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నా, ఇదే పరిస్థితి. ఇలాంటి వారు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు.
సాకులు చూపుతూ.. కోతలు విధిస్తూ
వివిధ కారణాలు చూపి పింఛన్లను తొలగించేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు పన్నుతోంది. వైకల్య శాతాన్ని సాకుగా చూపి దివ్యాంగులకు.. విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలను బూచిగా చూపుతూ వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తొలగించేందుకు కుట్రలను రచిస్తోంది.
దివ్యాంగులపైనా కర్కశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగ శాతాన్ని అధికంగా నమోదు చేయించి పింఛన్లు మంజూరు చేశారనే కుట్ర కోణాన్ని తెరపైకి టీడీపీ తెచ్చింది. పరిశీలన అంటూ కొత్త నాటకానికి కూటమి సర్కార్ తెరలేపింది. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో వీరందరికీ నోటీసులిచ్చి ఇబ్బందులకు గురిచేశారు. ఫలితంగా దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్ బాధితులు.. డాక్టర్ల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడ్డారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
నాడంతా సజావుగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా సజావుగా అందజేసేవారు. అర్హత ఉండి ఇంటి దగ్గరే పూర్తి వివరాలను వలంటీర్ అప్‌లోడ్ చేస్తే కొత్తగా మంజూరయ్యేవి. అయితే ఇవేవీ ఇప్పుడు కానరావడంలేదు.
లెక్కలకు.. వాస్తవానికి పొంతనేదీ..?
అధికారుల లెక్క మేరకు జిల్లా వ్యాప్తంగా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల్లో ప్రతి నెలా 500 నుంచి వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారు. ఒకవేళ ఇలానే 1000 మంది మరణించినా, ఈ రెండేళ్లలో 24 వేల పింఛన్లనే తొలగించాలి. అయితే 32 వేలకుపైగా కోత విధించింది. ప్రతి నెలా వేల సంఖ్యలో తొలగిస్తూ.. కొత్తగా మంజూరు చేయకుండా కూటమి ప్రభుత్వం కుతంత్రాలు చేస్తోంది.
గత టీడీపీ హయాంలో ఎవరైనా
మరణిస్తే కొత్తగా మంజూరు..
అయితే నేడు.. కుటుంబాలకు దాన్నీ దూరం చేసి..
సర్కార్ కొలువుదీరిన రెండేళ్లలో
నూతనంగా ఒక్కరికీ కేటాయించని వైనం
కోతలు విధిస్తూ.. ఆర్భాటపు ప్రచారం
చిల్లకూరులో సీఎం పంపిణీ చేయడంపై విస్మయం
ఎలాంటి ఆదరవు లేకుండా ప్రభుత్వమిచ్చే పింఛన్ మొత్తంతోనే బతుకుబండినీడుస్తున్న ఎన్నో కుటుంబాలకు అంతులేని శోకాన్ని ప్రస్తుత కూటమి సర్కార్ మిగిలిస్తోంది. టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటినా, నేటికీ ఒక్కటంటే ఒక్కటీ కొత్తగా మంజూరు చేయలేదు. పైగా ఉన్న వాటికి కోత విధిస్తూ.. తామేదో చేశామని గొప్పలు చెప్పుకొంటున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమానని ఎంతో మంది వీటిని పొందుతూ సంతోషంగా ఉండేవారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటిల రాజకీయాలకు తెరలేపి అర్హుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో రకరకాల కొర్రీలను తెరపైకి తీసుకొస్తున్న తీరుపై ప్రజానీకం భగ్గుమంటోంది. కొత్తగా మంజూరు చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఈయన పింఛన్ల పంపిణీ నిమిత్తం చిల్లకూరుకు బుధవారం రావడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇంత తేడానా..?
వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2024 జనవరిలో జిల్లా వ్యాప్తంగా 3,19,121 మంది లబ్ధిదారులు పింఛన్లను అందుకునేవారు. అయితే ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి ఈ సంఖ్యను 2,86,663కు కూటమి ప్రభుత్వం పరిమితం చేసింది. అంటే ఈ రెండేళ్లలో 32,458 మందిని తగ్గించి వారికి వేదనను మిగిల్చారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందనే సమాచారం కలవరాన్ని రేపుతోంది.


