సాక్షి, టాస్క్‌ఫోర్స్: కావలి పట్టణం కచ్చేరిమిట్టలో గత నెల 19న స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్, టీడీపీ తన వారితో కలిసి గిరిజన మహిళను వివస్త్రను చేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటన ఖాకీల మెడకు చుట్టుకోనుంది. రెండో పట్టణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన సంఘ నేతలు, ఎమ్మెల్సీలు న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కావలి టీడీపీ ముఖ్య నేత ఒత్తిడితో బాధితురాలిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా, ఆమె కుమారుడిపై కౌంటర్ కేసు పెడతామని, ఈ కేసుతో అతనిపై గూండా యాక్ట్ పెడుతామని, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కుటుంబానికి దక్కకుండా ఎన్‌కౌంటర్ చేస్తామని రాజీ పత్రం రాయించారని బాధితురాలు స్వయంగా మీడియా ముందు చెప్పడం తెలిసిందే. ఈ ఘటనను తొక్కి పెట్టడం, వారం రోజుల తర్వాత బాధితురాలి ఫిర్యాదుతోపాటు ఆమె కుమారుడిపై కౌంటర్ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇవి ఆరోపణలు మాత్రమే కాదని, నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రైవేట్ కేసులతో కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అన్ని ఆధారాలతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తోపాటు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు చెప్పడం విదితమే.
రెండు రోజుల్లో కార్యాచరణ అమలు
ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసు విషయంలో ఎందాకై నా న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ద్వారా చెప్పించారు. తాజాగా వైఎస్ జగన్ ఆదేశాలతో కాకాణి, రామిరెడ్డి ఆధ్వర్యంలో బాధిత గిరిజన మహిళకు అండగా నిలుస్తూ ఆమెకు న్యాయం జరిగే వరకు పోటారానికి సిద్ధమవుతూ ఆ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ట్రైకార్ చైర్మన్ (ఎస్టీ కార్పొరేషన్) గుండా సురేంద్ర, ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవితోపాటు ఎస్టీ విభాగానికి చెందిన రాష్ట్ర, జిల్లా నేతలు గురువారం కావలికి తరలి వస్తున్నారు. ఘటనా స్థలం వీడియోలు, ఫొటోలతో కేసు దాఖలు చేయడంతోపాటు ఆ రోజు నుంచి స్టేషన్‌లోని ఫుటేజీలను పరిశీలించాలని కోరుతూ నివేదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అట్టుడుకుతున్న కావలి
గిరిజన మహిళను వివస్త్రను చేసిన ఘటనను వెలుగు చూడనీయకుండా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ టీడీపీ ముఖ్యనేత అండతో పోలీసుల సహకారంతో రెడ్‌బుక్ వార్నింగ్‌లతో అడ్డుకోవడంతో ఆ వీధికే తెలిసిన సమాచారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెల్లడించడం, సాక్షి పత్రిక బట్టబయలు చేయడంతో ఆ రోజు నుంచి పట్టణం మొత్తం పాకిపోవడంతో ఇదే విషయమై ఎక్కడికక్కడ చర్చించుకోవడం గమనార్హం. ప్రేమించడం నేరకాదు. ఒక వేళ వేధిస్తే సదరు యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కానీ, అతని తల్లిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టి ఇది నేరం కాదనట్లు, ఆమెకు సంఘీభావం తెలిపిన సామాజిక మహిళ కార్యకర్త సీ శారదను, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని తప్పు పట్టడాన్ని సైతం పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనను ఎనిమిది రోజులుగా తొక్కిపెట్టడం, కేసు నమోదు చేసి ఐదు రోజులుగా ఈ విషయమై పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో వీరి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులుగా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్న తీరు వారి మెడకు చుట్టుకోక తప్పదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.
వివస్త్రను చేసిన ఘటనపై వారం తర్వాత బాధితురాలి కేసుతో పాటు కౌంటర్ కేసు నమోదు
ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి గిరిజన సంఘ నేతలు, ఎమ్మెల్సీలు సిద్ధం
ఘటనా స్థలంలో టీడీపీ నేతల
పైశాచికంపై వీడియోలు,
ఫొటోల సేకరణ
స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీలు
పరిశీలించాలని కోర్టుకు
నివేదించాలని నిర్ణయం
నేడు బాధితురాలికి వైఎస్సార్‌సీపీ
గిరిజన సంఘ నేతలు, ఎమ్మెల్సీలు, కాకాణి, రామిరెడ్డి పరామర్శ
వ్యక్తిగత హక్కులను కాలరాసిన పోలీసులు
టీడీపీ ముఖ్య నేత చెప్పారని కావలి రెండో పట్టణ పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు సామదాన దండోపాయాలను ప్రదర్శించారు. ఎట్టకేలకు ఈ విషయం బయటకు పొక్కడంతో విధిలేని పరిస్థితుల్లో కేసు నమోదు చేయడంతోపాటు బాధితురాలిని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు ఒరిజనల్స్ బయటకు తీసి సామాన్యులైన నిందితులకు అందజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నిందితులు, వారి తరఫున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన మహిళకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఒరిజనల్స్ ప్రదర్శించారు. ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను కాలరాయడమే అని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.


