● రెచ్చిపోతున్న తమిళనాడు,
పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లు
● గతంలో ఒకట్రెండే.. ఇప్పుడు పదుల సంఖ్యలో దండయాత్ర
● జీవనం కోసం నిత్య పోరాటంలో
ఆంధ్రా జాలర్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇకపై బోటు.. వేట.. సంపద మనదేనంటూ కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకారుల జీవన భృతి విడుదల సందర్భంగా సినిమా స్టయిల్లో డైలాగ్‌లను సీఎం చంద్రబాబు ఇటీవల వదిలారు. తమ జీవితాలు, బతుకులను నాశనం చేస్తున్న పొరుగు రాష్ట్రాల బోట్లపై స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో నిర్బంధించిన పాండిచ్చేరి బోట్లను మంత్రి లోకేశ్ డైరెక్షన్లో.. టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు నేతృత్వంలో వదిలేశారు. ఈ ఉదంతంతో ఉడికిపోతున్న గంగపుత్రులను మభ్యపెట్టేందుకు ఆ మరుసటి రోజు నుంచే ఆంధ్రా తీరంలో పాండిచ్చేరి, తమిళ బోట్లపై వివిధ శాఖలతో వారం రోజులు గస్తీ చేపట్టారు. ఆ వెంటనే చేపల వేటపై నిషేధం అమల్లోకి రావడంతో గస్తీ టీమ్ వెనక్కొచ్చేసింది. ఈ క్రమంలో కావలికి చంద్రబాబు వచ్చి సాగర తీరంలో తంబీల దొంగాటలు సాగవని.. పోలీస్, మత్స్య, మైరెన్ తదితర శాఖల సిబ్బందితో నిరంతరం గస్తీ కాస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. తిరిగి వేట ప్రారంభమైన అనంతరం పాండిచ్చేరి, తమిళ బోట్ల తీరం వెంబడి వేట సాగిస్తున్నా.. కట్టడి చేయలేక అధికారులు చేతులెత్తేశారు.
ఇప్పుడు భారీగా..
గతంలో ఒకట్రెండు మెకనైజ్డ్ బోట్లతో వచ్చే పాండిచ్చేరి, తమిళనాడు జాలర్లు ఇప్పుడు పదుల సంఖ్యలో వస్తున్నా.. అధికార యంత్రాంగం ముఖం చాటేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో నాలుగు బోట్లను నిర్బంధించిన ఆర్నెల్ల కాలంలో ఒక్క పడవ సైతం ఆంధ్రా తీరంపై వచ్చేందుకు సాహసించలేదు. అయితే వీటిని వదిలేసిన మరుసటి రోజు నుంచే రెట్టింపు స్థాయిలో తీరంవైపు దూసుకొస్తున్నాయని స్థానిక మత్స్యకారులు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా వేట నిషేధం తర్వాత పదుల సంఖ్యలో బోట్లు రాష్ట్రంలోని తీరంలోకి ప్రవేశించి ఇక్కడి మత్స్య సంపదను దోచుకుంటున్నారు. అత్యాధునిక బోట్లతో మెరుపు వేగంతో సరిహద్దులు దాటొచ్చి గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఇక్కడి మత్స్యకారులపై దాడులకూ తెగబడుతున్నారు. విలువైన వలలను ధ్వంసం చేస్తున్నారు.
కడలూరు టు సూర్యలంక
తమిళనాడులోని కడలూరు తీరం నుంచి రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక వరకు సుమారు 160 నాటికల్ మైళ్ల దూరం ఉంది. తిరుపతి జిల్లాలోని వాకాడులో గల గోవిందరావు పట్టపుపాళెం, జిల్లాలోని అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, ప్రకాశం జిల్లా రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం, కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో దాడులకూ తెగబడుతున్నారు.
నాలుగు బోట్లు మాయం
మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి పాండేచ్చేరికి చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లను ఎనిమిది నెలల క్రితం పట్టుకున్నారు. వీటిని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉంచారు. ఈ ఉదంతంపై ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. అయితే టీడీపీ బడానేతలు రంగంలోకి దిగి మత్స్యకారుల పెద్దలతో డీల్ కుదుర్చుకొని వాటిని వదిలేశారు. ఈ పరిణామాంపై మత్స్యకారులు కన్నెర్ర చేశారు. దీని వెనుకున్న పెద్దలపై కసితో రగిలిపోయారు. వీరిని మత్స్యకారులు చితకబాది వారిపై దురాయి విధించి జరిమానా కట్టించుకున్నారు. తీర ప్రాంతం నెల పాటు అట్టుడికినా ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మెహన్‌రెడ్డి జువ్వలదిన్నెలో పర్యటించి మత్స్యకారుల్లో భరోసా నింపారు. దీంతో బెంబేలెత్తిన ప్రభుత్వం కావలి మండలం తుమ్మలపెంటలో చంద్రబాబు పర్యటన పెట్టి మత్స్యకారులను బుజ్జగించేందుకు యత్నించారు. ఇకపై తమిళ తంబీల దొంగాటకు చెక్ పెట్టిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే హామీని అధికారులు నెరవేర్చలేదు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో కనీస చర్చలూ జరపలేదు.
రెచ్చిపోతూ..
తమిళనాడులోని నాగపట్నం, కడలూరు, పాండిచ్చేరిలోని కారైకల్ తీర ప్రాంతాల నుంచి మత్స్య సంపద ఎగుమతవుతోంది. కొందరు వ్యాపారులు మత్స్యకారులను కూలీలుగా పెట్టుకొని అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. ఇక్కడి జాలర్లను రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారు. దాడులు చేస్తూ సంపదను దోచుకెళ్తున్నారు. వీరి బరితెగింపును అడ్డుకోలేక.. వేటను సాగించలేక జాలర్లు రగిలిపోతున్నారు.
మోసం చేసిన కూటమి సర్కార్
ఇక్కడి మత్స్య సంపదను తమిళ జాలర్లు దోచుకెళ్తున్నారు. అడ్డుకోబోయిన మన వారిపై దాడులకు తెగబడుతున్నారు. కూటమి సర్కార్ చేసిన ద్రోహంతో గంగపుత్రులు రగిలిపోతున్నారు. వీరిని మభ్యపెట్టేందుకు.. మోసపూరితమైన సినిమా డైలాగ్‌లు చెప్పి.. చివరికి చేతులెత్తేశారు. వచ్చే నెలాఖరు వరకు సమయమిస్తున్నాం. ఈలోపు పక్క రాష్ట్రాలతో చర్చలు జరిపి తీర ప్రాంతంలోకి పాండేచ్చేరి బోట్లు రాకుండా చూడాలి. అలా కాని పక్షంలో ప్రభుత్వంతో పోరాటం చేస్తాం. – కొండూరు,
అనిల్‌బాబు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్‌ను రూ.288.80 కోట్లతో చేపట్టి దాదాపు 90 శాతం మేర పూర్తి చేశారు. అప్పట్లోనే ప్రారంభానికి రంగం సిద్ధం చేశారు. అయితే మిగిలిన పనులను పూర్తి చేయకపోగా పట్టించుకోవడాన్ని టీడీపీ సర్కార్ మానేసింది. మత్స్యకారుల బోట్లకు పెట్రోల్ బంక్, చేపలను నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్, ఐస్ ఫ్యాక్టరీలను నిర్మించాల్సి ఉంది.
ఫిషింగ్ హార్బర్‌పై సర్కార్ నిర్లక్ష్యం
హద్దులు మీరి..
వాస్తవానికి సముద్రంలో వేట సాగించేందుకు గానూ కొన్ని నిబంధనలను కేంద్ర మత్స్యశాఖ విధించింది. తీర ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దులు మీరకూడదనే ఆంక్షలున్నాయి. ఈ మేరకు సాధారణ తెప్పలు, బోట్లతో తీరం నుంచి 8 కిలోమీటర్ల (ఐదు నాటికల్ మైళ్లు) వరకు వేట చేసుకోవచ్చు. బోట్ల సామర్థ్యాన్ని బట్టి మరింత ముందుకూ వెళ్లొచ్చు. ఇంజిన్ బోట్లయితే 23 కిలోమీటర్ల (12 నాటికల్ మైళ్లు) అవతలే వేట చేసుకోవాలి. అయితే తమిళ జాలర్లు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటొస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మత్స్యకారులు వేట సాగించే చిన్న బోట్లు, తెప్పలను ఢీకొని వారి మత్స్య సంపదను దోచేస్తున్నారు.


