● కొడుకు ప్రేమిస్తే.. తల్లిని వివస్త్ర చేసి కొట్టడం నేరం కాదా..?
● గిరిజన మహిళపై దాష్టీకంలో
నిందితుల రక్షణకే కౌంటర్ కేసు
● కులం, మతం పేరుతో పోలీస్, రెవెన్యూ శాఖ ఆపసోపాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కావలి పట్టణం కచ్చేరిమిట్టలో టీడీపీ నేతలు గిరిజన మహిళపై సాగించిన దుశ్శాసనపర్వాన్ని వెలుగు చూడనీయకుండా అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో పోలీసులు వ్యూహాత్మకంగా సమాధి చేసేందుకు ‘రెడ్‌బుక్’ వార్నింగ్‌కు తెగబడ్డారు. గత నెల 19వ తేదీ రాత్రి ఘటన జరిగితే.. వారం తర్వాత 26వ తేదీ హడావుడిగా బాధితురాలి కేసుతోపాటు ఆమె కుమారుడిపై కౌంటర్ కేసు నమోదు చేయడం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి పట్టణంలో ఈ దారుణం జరిగినా.. బయటకు పొక్కనీయకుండా అధికార బలంతో తొక్కిపెట్టారని వెల్లడించడంతో ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని పోలీసులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ కేసును అడ్డు పెట్టుకుని గిరిజన మహిళను వివస్త్రను చేసి, కులం పేరుతో దూషించిన కేసును కోర్టు వరకు వెళ్లనీయకుండా నిందితులకు రక్షణ కల్పించేందుకు రాజీ చేయాలని భావించే ఆమె కుమారుడిపైనా కేసు బనాయించారని స్పష్టమవుతోంది.
పోలీసుల బరితెగింపు
కొడుకు ప్రేమిస్తే తల్లిని వివస్త్ర చేసి విచక్షణారహితంగా కొట్టడం నేరం కాదనే రీతిలో పక్షపాతంగా కావలి పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బాధితురాలే స్వయంగా తనను పోలీసులు ఏ విధంగా బెదిరించారో మీడియా ముందు స్పష్టం చేసింది. తనను వివస్త్రను చేసి, కొట్టినట్లు విషయం బయటకు వస్తే నీ కొడుకుపై కూడా కేసు ఉంది.. అతనిపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కుటుంబానికే దక్కకుండా ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని చెబుతోంది. నిందితులు మీడియా సమావేశంలో పోలీసుల అండదండలతోనే బతుకుతున్నామంటూ చెప్పడం చూస్తే వారికి పోలీసుల రక్షణ ఉందనే వాస్తవ పరిస్థితిని స్పష్టం చేసింది. దీన్ని బట్టి దుశ్శాన పర్వానికి అధికార పార్టీ ముఖ్య నేత ఆదేశాలతోనే పోలీసులు రెడ్‌బుక్ వార్నింగ్‌తో సమాధి కట్టేశారని అర్థమవుతోంది. ఈ ఉదంతంలో పోలీసులు నమోదు చేసిన ఈ రెండు కేసులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ ఘటన జరిగి 12 రోజులు దాటినా.. ఈ వ్యవహారంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
కేసు తారుమారుకు ఆపసోపాలు
గిరిజన మహిళకు జరిగిన అవమాన ఉదంతం తెలిసిన కావలి పట్టణ ప్రజలు ఓ పక్కన ఛీకొడుతుంటే.. మరో పక్కన పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి కేసు తారుమారు చేసేందుకు కులం, మతం పేరుతో ఆపసోపాలు పడుతున్నారు. ఆమెకు సంబంధించిన కులం, మతం, ఆధార్, ఓటరుకార్డులు ఇలా వ్యక్తిగతమైన ఒరిజనల్ సర్టిఫికెట్లను బయటకు తెచ్చారు. ‘కులం’ పుట్టుకతోనే నిర్ణయించబడుతుందని, అనుసరిస్తుందనే కీలక న్యాయసూత్రాన్ని విస్మరించి.. బాధితురాలు ముస్లింగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని న్యాయవిజ్ఞలు అభిప్రాయపడుతున్నారు. మహిళ కులాంతర, మతాంతర విహహం చేసుకున్నంత మాత్రాన ఆమె జన్మతః కులం మారదని సుప్రీం కోర్టు చెబుతుందని అంటున్నారు. సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా ఆమె కులాన్ని, మతాన్ని మార్చేసి కేసును నీరుగార్చేందుకు పోలీసులు, రెవెన్యూ కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలకు జరుగుతున్న పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. బాధితురాలికి ప్రజామద్దతు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం అనుకూల మీడియాతో ప్రెస్‌మీట్ పెట్టించి సరికొత్త డ్రామాలకు డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారనే ప్రచారం జరుగుతోంది.
ఎస్టీ కమిషన్,
మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు..?
గిరిజన మహిళకు జరిగిన అన్యాయంపై వీడియో ఆధారాలతో ఎస్టీ కమిషన్‌తోపాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేసేందుకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఒకటి.. రెండు రోజుల్లో కావలికి తరలివచ్చి.. బాధితురాలిని పరామర్శించి తమ మద్దతును ప్రకటిస్తారని సమాచారం.


