● శివాలయ పూజారి మృతి
కోవూరు: విద్యుత్ షాక్‌కు గురై శివాలయ పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటన పోతిరెడ్డిపాళెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం రాళ్లమిట్ట అరుంధతీయవాడకు చెందిన దువ్వూరు కృష్ణయ్య (71) పోతిరెడ్డిపాళెంలోని పెన్నానది కరకట్టపై ఉన్న పెన్నేశ్వర శివాలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన ఆలయ సమీపంలోని రేకుల ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లోని స్టాండ్ ఫ్యాన్ ప్లగ్‌ను సాకెట్‌లో పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించింది. ఫ్యాన్‌ను పట్టుకోవడంతో కృష్ణయ్యకు తీవ్రస్థాయిలో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయన్ను కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు దువ్వూరు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణయ్య మృతితో పోతిరెడ్డిపాళెం, రాళ్లమిట్ట ప్రాంతాల్లో విషాదం నెలకొంది.


