నెల్లూరు(అర్బన్): కేన్సర్.. ఈ పదం వినగానే ప్రతిఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఒక్కరికి కేన్సర్ సోకినా కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కేన్సర్ వస్తే మరణం తథ్యమని అనుకునే వారే ఎక్కువ. జీవనశైలి, కాలుష్యం, కల్తీ ఆహారం, జంక్‌ఫుడ్స్ కారణంగా రోగులు పెరిగిపోతున్నారు. ఎన్నో రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ కొన్ని రకాల నివారణకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో హ్యూమన్ పాపిల్లోవా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ కూడా ఒకటి. దీనితో పలురకాల కేన్సర్లు జీవితంలో దరిచేరవు. అందుకే ఈ వ్యాక్సిన్‌ను తొలిదశలో 14 ఏళ్లు నిండి 15వ జన్మదినం జరుపుకోని బాలికలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది తొలిసారిగా అందుకు శ్రీకారం చుట్టింది. ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దొరుకుతున్నప్పటికీ పేదల కోసం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తోంది. సాధారణంగా రెండు డోసులు వేయాల్సి ఉంది. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
జిల్లాలో..
జిల్లా జనాభాలో 14 సంవత్సరాల వయస్సు నిండి 15 ఏళ్లు నిండని బాలికలు 1 శాతం మంది ఉంటారని అంచనా వేశారు. ఈ లెక్కన సుమారు 26 వేల మంది బాలికలు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు వైద్యారోగ్య శాఖ అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తొలి విడతగా 8,616 వ్యాక్సిన్లను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. మరో వారంలో మిగిలిన వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు సరఫరా చేశారు. టీకా ఎలా వేయాలి..ఎన్ని డిగ్రీల కూలింగ్‌లో వ్యాక్సిన్ ఉంచాలి.. వ్యాక్సిన్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, తదితర అంశాలపై నెలక్రితమే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
హెచ్‌పీవీ అరికట్టగల కేన్సర్లు
హెచ్‌పీవీ వ్యాక్సిన్ మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార కేన్సర్), బాహ్య జననేంద్రియ, యోని, మలద్వారా, పురుషాంగ, గొంతు, నాలుక వెనుక భాగంలో వచ్చే కేన్సర్లను అరికట్టవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో జెనిటల్ వార్ట్స్ లాంటి వ్యాధులు కూడా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతుతున్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తే ఎంతో ఉపయోగం. హెచ్‌పీవీ వైరస్ పురుషుల నుంచి మహిళలకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బాలురకు కూడా వేయడం మంచిది. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది బాలికలకు మాత్రమే వేయనుంది.
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభం నేడు
తొలిదశలో బాలికలకు
ఉచితంగా టీకాలు
ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులకు చేర్చిన వైద్యాఆరోగ్య శాఖ
జిల్లాలో 26 వేల మంది బాలికలు ఉంటారని అంచనా
బాలికలకు వ్యాక్సిన్ వేస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం 14 ఏళ్లు నిండిన 15వ జన్మదినం జరుపుకోని బాలికలకు మాత్రమే కేన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను వేయనున్నాం. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ అనుమతితో వ్యాక్సినేషన్‌ను బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు వైద్యసిబ్బంది వచ్చినప్పుడు బాలికలకు వ్యాక్సిన్ వేయించాలి.
– డాక్టర్ సుజాత, డీఎంహెచ్‌ఓ


