● ఎంపీ గొల్ల బాబూరావు
రూ.15 లక్షల ఎంపీ నిధుల మంజూరు
● మాజీ మంత్రి నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: కోవూరు నియోజకవర్గంలోని గిరిజన కాలనీల్లో ఆర్వోప్లాంట్ల ఏర్పాటుకు తన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్ మంజూరు చేశారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి (ఎన్‌ఎస్‌ఆర్) గిరిజన కాలనీలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 లక్ష లు, అలాగే చేతిపంపు నిర్మాణం కోసం రూ.2.5 లక్షలు మంజూరు చేశారు. కోవూరు మండలం పాటూరు, ఉత్తరపల్లిపాళెం ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ కోసం మరో రూ.5 లక్షలు, బోరు నిర్మాణానికి రూ.2.5 లక్షలను కేటాయించినట్లు ప్రసన్న పేర్కొన్నారు. గిరిజన కాలనీల్లో తాగునీటి సమస్యలను ఎంపీ గొల్ల బాబూరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి, తక్షణమే నిధులు విడుదల చేశారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేదల కనీస అవసరాల తీర్చేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. అడిగిన వెంటనే స్పందించి నిధులు కేటాయించిన గొల్లబాబూరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా సర్కిల్‌కు గుర్తింపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులకు సేవలందించడంలో జిల్లా సర్కిల్ ముందంజలో ఉందని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం అన్నారు. నెల్లూరులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ విద్యుత్ సెక్షన్ పరిధిలో గాంధీనగర్‌లో మంగళవారం ఆయన ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని టాప్–20లో నెల్లూరు జిల్లా సర్కిల్‌కు చెందిన 10 సెక్షన్లు ఉన్నాయన్నారు. కోటమిట్ట సెక్షన్ 87 శాతం, కోవూరు టౌన్, స్టోన్‌హౌస్‌పేట, ఏకే నగర్ సెక్షన్లు 85 శాతం, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, డైకస్‌రోడ్డు సెక్షన్లు 84 శాతం, టౌన్‌హాల్, కిసాన్ నగర్ సెక్షన్లు 83 శాతం సాధించాయన్నారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈఈలు శ్రీధర్, శేషాద్రి బాలచంద్ర పాల్గొన్నారు.
మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని..
● కుమారుడిపై తండ్రి కర్రతో దాడి
నెల్లూరు సిటీ: మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని కుమారుడు నిద్రిస్తున్న సమయంలో తండ్రి కర్రతో దాడి చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. రూరల్ మండలంలోని మూడో మైలులో మసీదుకు సమీపంలో సుబ్బారావు, అతని భార్య సూరమ్మ ఉంటున్నారు. వారికి తిరుపతి అనే కుమారుడున్నాడు. సుబ్బారావు మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి తనకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. కుమారుడు.. తండ్రిని మందలించి డబ్బులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. కోపోద్రిక్తుడైన సుబ్బారావు.. కుమారుడు నిద్రిస్తున్న సమయంలో కర్రతో ముఖంపై దాడి చేశారు. గాయపడిన తిరుపతిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.


