నెల్లూరు సిటీ: ఒంటరి మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కుర్చీకి కట్టేసి, ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో నగర ఏఎస్పీ దీక్ష శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ వద్ద టిఫెన్ అంగడి నిర్వహిస్తున్న ఎ.నాగరత్నమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీ తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మట్లపాళెం గ్రామానికి చెందిన టి.రామకృష్ణ, బిట్రగుంటకు చెందిన ఎం.మాల్యాద్రిలు చోరీ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో నాగరత్నమ్మ ఇంట్లో నగదు, బంగారం ఉంటుందని భావించారు. ఆమె ఒంటరిగా ఉంటుండడంతో తమ చోరీ సులువుగా ఉంటుందని, గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించారు. చంపేస్తానని బెదిరించి, నాగరత్నమ్మను కుర్చీకి తాళ్లతో కట్టేశారు. బెడ్‌రూమ్‌లోని ట్రంకు పెట్టిలో రూ.1.50 లక్షలు, 160 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యారు. స్థానికులు ఉదయం వచ్చి చూడగా ఆమెను కట్టేయడాన్ని గుర్తించి విడిపించారు. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తన సిబ్బందితో నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వద్ద ఇద్దరు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.63 వేలు నగదు, 153 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరితగతిన నిందితులను పట్టుకున్న సిబ్బందిని దీక్ష అభినందించారు. సమావేశంలో ఎస్సై కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పరారీలో ప్లాన్ చేసిన వ్యక్తి
ఈ చోరీకి నగరంలోని మాగుంట లేఅవుట్‌కు చెందిన చంద్రమోహన్‌రెడ్డి ప్లాన్ చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాధితురాలి ఇంటికి సమీపంలో ఫైనాన్స్ కోసం వస్తూ ఆమె వద్ద భారీగా డబ్బులు ఉంటాయని చంద్రమోహన్‌రెడ్డి భావించారు. దీంతో ఆయనకు జైలులో రామకృష్ణ, మాల్యాద్రిలతో పరిచయం ఉండడంతో వారితో చోరీకి స్కెచ్ వేశారు. సమయం చూసి చోరీ చేయించారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
ఆ ఇద్దరూ అంతర్ జిల్లాల నేరగాళ్లు
వారిపై పలు జిల్లాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు రామకృష మీద డీసీ(డోసియర్ క్రిమినల్) షీట్ ఉంది. ఆయనపై తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 14 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో ఒకటి మొత్తంగా 27 కేసులు ఉన్నాయి. అదే క్రమంలో బిట్రగుంటకు చెందిన మాల్యాద్రి మీద సైతం డీసీ షీట్ ఉంది. నిందితుడిపై వైఎస్సార్ కడప జిల్లాలో 1, తూర్పుగోదావరి 3, పశ్చిమగోదావరి 1, ప్రకాశం జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. మొత్తంగా 14 కేసులు ఉన్నాయి.
ఒంటరి మహిళపై దాడి చేసి
బంగారం, నగదు అపహరణ
ముగ్గురు నిందితుల్లో
ఇద్దరిని పట్టుకున్న పోలీసులు
153 గ్రాముల బంగారం,
రూ.63 వేల నగదు స్వాధీనం
వీరిపై ఏడు జిల్లాల్లో
పదుల సంఖ్యలో కేసులు
ఆ ఇద్దరూ దొంగతనమే పనిగా పెట్టుకున్నారు. చోరీలు చేయడం.. పోలీసులకు పట్టుపడడం వారికి పరిపాటి. జైల్లో స్నేహితులైన వారు.. కలిసి ప్లాన్ చేస్తే ఎంత పెద్ద చోరీ అయినా చేయవచ్చని నిర్ణయించుకున్నారు. వారిపై ఏడు జిల్లాల్లో పదుల
సంఖ్యలో చోరీ కేసులు ఉన్నాయి.


