కారు ఢీకొని జింక మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని జింక మృతి

Mar 8 2026 7:22 AM | Updated on Mar 8 2026 7:22 AM

కోవూరు: ఆహారం కోసం జనావాసాల వైపు వస్తూ గుర్తుతెలియని కారు ఢీకొని జింక మృతిచెందిన ఘటన మండలంలోని పోతిరెడ్డిపాళెం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గంగవరం కాలువ వద్ద ముంబై హైవే సమీపంలో జింక రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

చెట్టు పైనుంచి పడి విద్యార్థినికి గాయాలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని దర్గామిట్టలో గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థిని చెట్టు పైనుంచి పడిన ఘటన కలకలం రేపింది. ఆ హాస్టల్‌ సిబ్బంది, అధికారుల నుంచి సేకరించిన వివరాల మేరకు.. సరస్వతి పూజ కోసం మామిడాకులు కోసేందుకు ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం హాస్టల్‌ భవనాన్ని ఎక్కారు. అయితే హఠాత్తుగా తొమ్మిదో తరగతి విద్యార్థిని చెట్టుపై నుంచి పడిపోయింది. గడ్డం భాగంలో దెబ్బతగలడంతో రక్తం కారుతున్న విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఐటీడీఏ పీఓ శ్రీనివాసులు హాస్టల్‌ పరిశీలనకు వచ్చారు. హాస్టల్‌ సిబ్బందిలో ఆందోళనను చూసి ప్రశ్నించగా ఇక్కడ తొమ్మిదో తరగతి విద్యార్థిని చెట్టుపై నుంచి పడిందని, ఆస్పత్రిలో చేర్చామని వారు తెలపడంతో పీఓ తక్షణమే రామచంద్రారెడ్డి ఆస్పత్రికి వెళ్లి సందర్శించారు. అక్కడ సిబ్బంది విద్యార్థిని నోటికి దెబ్బలు తగలడంతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని, తిరుపతికి తీసుకెళ్లాలని చెప్పడంతో అంబులెన్స్‌ కూడా మాట్లాడారు. అయితే తిరుపతికి వెళ్లేలోపు ఆలస్యమవుతుందని, కిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఐటీడీఏ అధికారులు తల్లిదండ్రుల అనుమతితో నారాయణ ఆస్పత్రికి తరలించి చికిత్సను ప్రారంభించారు. దీనిపై ఐటీడీఏ పీఓను సంప్రదించగా ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆరోగ్యం బాగుందని తెలిపారు. జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి సుజాత మాట్లాడుతూ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మా మనుమరాలు బాగుంది

పొదలకూరు మండలం బచ్చలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాయపడిన విద్యార్థిని తన మనుమరాలు అని, ఘటనపై ప్రిన్సిపల్‌ నుంచి పీఓ వరకు బాగా స్పందించారన్నారు. ఆస్పత్రి ఖర్చుల కోసం పీఓ శ్రీనివాసులు రూ.10 వేలు ఇచ్చారన్నారు. తాము పెట్టిన డబ్బును సైతం ప్రభుత్వం ద్వారా తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తన మనుమరాలి ఆరోగ్యం బాగుందన్నారు.

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి

నెల్లూరు సిటీ: జిల్లాలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. నగరంలోని ఉమేష్‌ చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం పోలీస్‌ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు వచ్చే పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డయల్‌ 112 కాల్స్‌కు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్‌ నిఘా పెంచాలని, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సౌజన్య, ఎస్బీ, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement