నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని, 12వ పీఆర్పీ కమిషన్ ఏర్పాటు చేసి జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారం రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.పెంచల నరసయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై రెండేళ్ల నుంచి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పరిష్కరించలేదన్నారు. కరోనా సమయంలో, ప్రకృతి విపత్తుల సందర్భంగా వారి ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఇప్పటికై నా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ చెన్నుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు ఎం.సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మనోజ్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, లోకేష్, శ్రీనివాసులు, రాము, జైకుమార్, రమేష్, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, షఫీ పాల్గొన్నారు.


