దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా క్రిస్‌సిటీ భూ నిర్వాసితుల పరిస్థితి తయారైంది. కృష్ణపట్నం పోర్టు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూములను రైతులను సంతృప్తి పరిచే రీతిలో పరిహారం చెల్లించే విధంగా సేకరించింది. పరిహారం అందించే ప్రక్రియ వేగంగా చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ ఖాతాలో నిధులు జమయ్యాయి. అయితే ఈలోగా ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ నిర్వాసితుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.
రెండేళ్లు గడుస్తున్నా.. మిగిలిన పరిహారం ఇవ్వకుండా అన్నదాతలకు చుక్కలు చూపిస్తోంది. రైతులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు.
చిల్లకూరు: అవి సిలికా భూములు. రైతులు ఏడాదిలో మూడు పర్యాయాలు వేరుశనగ పండించేవారు. ఎకరాకు ఖర్చులు పోను సుమారుగా రూ.50 వేల వరకు ఆదాయాన్ని పొందేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం క్రిస్‌సిటీ పేరుతో భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. రైతులు ముందుకొచ్చారు. అధికారులు చిల్లకూరు, కోట మండలాల్లోని రెండు రెవెన్యూ పరిధిలో సుమారు 987 ఎకరాల భూములను సేకరించి ఏపీఐఐసీకి అప్పగించారు. తొలి విడతలో తమ్మినపట్నంలో సుమారు 300, కోట మండలంలో సుమారు 233 ఎకరాలకు సంబంధించి రైతులకు 40 శాతం మేర పరిహారాన్ని నాడు విడుదల చేశారు.
ఇప్పుడిలా..
ఎవరి వద్దనైనా భూమి కొనుగోలు చేస్తే పూర్తిగా సెటిల్‌మెంట్ చేసిన అనంతరం పనులు మొదలు పెట్టాలి. కానీ క్రిస్‌సిటీకి సేకరించిన భూమి విషయంలో అలా జరగడంలేదు. ఎన్నికల అనంతరం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో అన్నదాతలు ఆందోళనకు దిగడంతో గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడుదల చేసిన 40 శాతం మొత్తాన్ని రైతులకు అందించి చేతులు దులుపుకుంది. మిగిలిన 60 శాతం ఇవ్వకుండానే అధికార పార్టీ నాయకుల అండ, జిల్లా స్థాయి అధికారుల భరోసాతో క్రిస్‌సిటీలో కాంట్రాక్ట్ సాధించిన బీఆర్‌ఎస్ సంస్థ ఇష్టానుసారంగా పనులు చేపడుతోంది. బాధిత రైతులు అక్కడికి వెళ్లి తమకు పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని కోరితే సదరు సంస్థకు చెందిన సిబ్బంది దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు కలెక్టర్, గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ ఖాతాలో నిధులున్నా ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోంది. వాటిని ఇతర అవసరాలకు ఖర్చు చేశారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా మార్పుతోనే ఆలస్యమా?
భూ సేకరణ జరిగిన సమయంలో చిల్లకూరు, కోట మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. పరిహారం అంశం పూర్తిగా తిరుపతి కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది. నగదు కూడా ఆయన ఖాతాలో ఉండగా అక్కడి నుంచి గూడూరు సబ్ కలెక్టర్ ఖాతాలోకి మార్చారు. తర్వాత రైతులకు 40 శాతం మేర పరిహారం చెక్కులు అందించారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో రెండు మండలాలు పూర్తిగా నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. గూడూరు సబ్ కలెక్టర్ బదిలీపై వెళ్లారు. 60 శాతం పరిహారం కోసం అన్నదాతలు అధికారులను కలిసి మాట్లాడితే జిల్లా మార్పు కారణంగా మరోసారి రికార్డులను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఆలోచిస్తామంటున్నారు.
ప్రభుత్వ భూమిగా గుర్తింపు
987 ఎకరాల్లో సుమారు 260 ఎకరాలు రైతులు సాగులో ఉంది. అయితే కోవిడ్ సమయంలో కొందరు సాగు చేపట్టకపోవడంతో అప్పటి శాటిలైట్ చిత్రాలను ఆధారంగా చేసుకుని అధికారులు ఆ భూములను ప్రభుత్వానికి నమోదు చేసి పరిహారం అందించేందుకు నిరాకరించారు. అలాగే కోట మండలంలో డీకేటీ భూములకు అందించే పరిహారం చిల్లకూరు మండలంలో ఇవ్వకుండా తక్కువగా అందించడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూమిగా గుర్తించిన 260 ఎకరాల విషయంపై మాట్లాడకుండా అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, పరిహారం అందించేందుకు తమవంతు కృషి చేస్తామని రైతుల్ని మభ్యపెట్టి క్రిస్‌సిటీలో పనులు చేయిస్తున్నారు.
క్రిస్‌సిటీ భూ నిర్వాసితులకు కూటమి అన్యాయం
చెల్లింపులను పట్టించుకోని అధికారులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే
40 శాతం పరిహారం జమ
మిగిలిన మొత్తానికి నేటి ప్రభుత్వంలో ఇంతవరకు దిక్కు లేదు
తీవ్రంగా నష్టపోయామంటున్న సన్నకారు రైతులు


