ఇంటర్‌ పరీక్షలకు 443 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 443 మంది గైర్హాజరు

Mar 6 2026 8:11 AM | Updated on Mar 6 2026 8:11 AM

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా 443 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంఽధించి 5,066 మందికి గానూ 4,768 మంది హాజరుకాగా, 298 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,232 మందికి గానూ 1,087 మంది హాజరుకాగా 145 మంది గైర్హాజరయ్యారు. గుంటూరు ఆర్జేడీ జె.పద్మ కావలిలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అదే విధంగా నెల్లూరు నగరంలోని కేఏసీ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న జవాబుపత్రాల మూల్యాంకనాన్ని పరిశీలించారు.

రైల్లోంచి జారిపడి..

వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైమ్‌): ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన విజయమహాల్‌గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై గురువారం చోటుచేసుకుంది. మృతుడు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. వయసు 45 నుంచి 50 సంవత్సరాల్లోపు ఉండొచ్చు. తెలుపు, బులుగు రంగుల అడ్డచారలు కలిగిన హాఫ్‌ హ్యాండ్స్‌ టీషర్టు, సిమెంట్‌ రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

గుర్తుతెలియని

వృద్ధుడి మృతి

నెల్లూరు(క్రైమ్‌): అనారోగ్యంతో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన రాజరాజేశ్వరి గుడి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉండొచ్చు. సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుడి పరిసర ప్రాంతాల్లో విచారించగా మృతుడు కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడని, సొంతూరు రాజమండ్రి అని చెప్పారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

నెల్లూరులో

గంజాయి స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): గంజాయిని విక్రయించేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు వ్యక్తులను నెల్లూరు వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి కథనం మేరకు.. కొండాయపాళెం అనగుంటకు చెందిన మహేష్‌, బీవీనగర్‌కు చెందిన యువరాజ్‌, కరిముల్లా స్నేహితులు. వీరు మద్యం, గంజాయికి బానిసయ్యారు. ఏడాది క్రితం మహేష్‌ ను చిన్ననాటి క్లాస్‌మెట్‌ హరనాథపురానికి చెందిన సందీప్‌కుమార్‌ కలిశాడు. అతను రాజమండ్రి నుంచి గంజాయిని తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మహేష్‌కు చెప్పాడు. దీంతో మహేష్‌ తన స్నేహితులు యువరాజ్‌, కరిముల్లాకు చెప్పి తాము గంజాయి విక్రయించి పెద్ద మొత్తంలో నగదు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మూడురోజుల క్రితం సందీప్‌ ద్వారా రాజమండ్రి నుంచి 3 కేజీల గంజాయిని తెప్పించారు. వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించసాగారు. గురువారం వారు పొదలకూరురోడ్డు శ్రీలంక కాలనీ సమీపంలో ఆటోలో గంజాయిని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారని వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మహేష్‌, యువరాజ్‌, కరిముల్లాను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 2.396 గ్రాముల గంజాయిని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.23,960 అని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

ప్రయాణికులకు

మెరుగైన సేవలు

రాపూరు: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే ఆర్టీసీ లక్ష్యమని నెల్లూరు జోన్‌ ఈడీ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో జోనల్‌ చైర్మన్‌ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డితో కలిసి ఆర్వో ప్లాంట్‌ను గురువారం ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని డిపో ల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రయాణికులు కూర్చునేందుకు నూతన కుర్చీలు, బస్టాండ్ల పరిశుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి షమీమ్‌, డిప్యూటీ చీఫ్‌ రవికాంత్‌, ఆర్టీసీ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

రహదారి ఇలా..

రాకపోకలెలా?

సైదాపురం: మండలంలోని సైదాపురం నుంచి ఊటుకూరుకు వెళ్లే రహదారిపై అడుగుకో గుంత దర్శనమిస్తోంది. సుమారు 5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే గంటకు పైగా సమయం పడుతోంది. ఇటీవల ఆ రహదారి పనులు కొంతమేర చేశారు. మిగిలినచోట్ల చేయకపోవడంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement