కదం తొక్కిన కర్షక మహిళలు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కర్షక మహిళలు

Mar 6 2026 8:11 AM | Updated on Mar 6 2026 8:11 AM

భూస్వాముల కబంధహస్తాల్లో మా భూములు

స్వాధీనం చేయాలని ఆందోళన

కావలి రూరల్‌: కావలి మండలం చెన్నాయపాళెం పెద్ద పట్టపుపాళెంలోని సీతారామనగరం గ్రామ పరిధిలోని తమ భూములు తమకే ఇవ్వాలంటూ గురువారం మహిళలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం సర్వే నంబర్‌ 396 నుంచి 402లో భూములు ఇచ్చిందన్నారు. ఇప్పుడు వాటిపై హక్కులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా తమ భూములను నాయకులు ఆక్రమించి అనుభవిస్తున్నారని వాపోయారు. అడవులను తలపిస్తున్న భూములను సాగుకు అనుకూలంగా తీర్చిదిద్ది సవక, జామాయిల్‌ మొక్కలు వేసి సాగుకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం బీపీసీఎల్‌ కంపెనీ నిమిత్తం భూ సేకరణ పేరుతో అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు సాగు చేసుకుంటూ ఉంటే ఊర్లో జరిగిన పెద్ద గొడవలు, బాంబు దాడుల కారణంగా మత్స్యకార కుటుంబాలు ఊరును వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తర్వాత అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి పొలాలను చూసుకుంటున్నామని తెలిపారు. అయితే ఇదే సమయంలో కొందరు ఆ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు. భూములిచ్చిన సమయంలో జామాయిల్‌, సవక మొక్కలు వంటివి వేసుకుని జీవనం సాగించుకోవాలని ప్రభుత్వం చెప్పిందని బాధితులు గుర్తుచేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిజమైన హక్కులు ఎవరివో తేల్చి, అక్రమ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీపీసీఎల్‌ నిమిత్తం భూములు సేకరిస్తూ తమకు నష్టపరిహారం రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు అడంగళ్‌ చేయించుకుని అనుభవిస్తున్నారని వాపోయారు. సుమారు 600 మంది మహిళలు భూముల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పల్లెకారి తిరుపతమ్మ, పన్నాడి జ్యోతి పొదుపు గ్రూపు మహిళల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలువురు పొదుపు మహిళా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement