● బీజేపీ నాయకుడు శ్రీనివాసులు యాదవ్
వెంకటాచలం: టీడీపీ నేత, చవటపాళెం సొసైటీ అధ్యక్షుడు రాధాకృష్ణమ నాయుడి దోపిడీపై ఆధారాలతో సహా నిరూపిస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు, నిడిగుంటపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం వచ్చాక బలహీనవర్గాలను పక్కన పెట్టేస్తారా?, ఇదేనా కూటమి ప్రభుత్వ విధానమని ప్రశ్నించారు. రాధాకృష్ణమనాయుడు ఎమ్మెల్యేగా ఫీలవుతున్నాడని, ఇలానే కొనసాగితే కూటమి చాలా నష్టపోతుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో నిడిగుంటపాళెంలో బీజేపీ నాయకులపై కేసులు పెట్టించిన నీచ సంస్కృతి రాధాకృష్ణమనాయుడు, పద్మనాభనాయుడిది కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు గ్రామాల్లో కనిపించని రాధాకృష్ణ, అధికారం వచ్చిన తర్వాత పెత్తనం చేస్తే తాము ఊరుకునే ప్రసక్తిలేదని హెచ్చరించారు. సోమిరెడ్డి ఇచ్చిన పదవులు తప్ప, ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చరిత్ర నీకు ఉందానని విమర్శించారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు హసనాపురం శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు.


