● ఇరిగేషన్ శాఖలో అధికార పార్టీ
నేతల పెత్తనం
● గందరగోళంగా మారిన పరిస్థితి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా నీటిపారుదల శాఖలో అధికార పార్టీ నేతల ప్రమేయం నానాటికీ అధికమవుతోంది. ఫలితంగా ఆ శాఖ పనితీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. రైతులకు అవసరమైన పనుల విషయంలోనూ అధికార పార్టీ నేతలు చొరబడుతుండటంతో ఆ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు.
నేటికీ నోచుకోని టెండర్లు
ఈ ఉదంతానికి ఉదాహరణగా మోంథా తుఫాన్‌కు సంబంధించి మంజూరైన పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రైతులకు సాగునీటిని అందించేందుకు గానూ 1615 పనులకు రూ.93 కోట్లను కలెక్టర్ కేటాయించి మూడు నెలలైంది. అయినా ఇవి ఇ ప్పటికీ ప్రారంభమైన దాఖలాల్లేవు. అధికార పార్టీలోని ఆధిపత్య ప్రమేయమే దీనికి కారణమని తెలుస్తోంది. వీటికి టెండర్లు పిలవకుండా తాము చెప్పిన వారికే పనులను కట్టబెట్టి చేయించాలంటూ అధికారులను ప్రజాప్రతినిధులు బెదిరించారని సమాచారం. మరోవైపు కాలువలు, చెరువులు, గట్లు తదితర పనులను నేటికీ ప్రారంభించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఏబీ సమావేశాలను ఇప్పటికే మూడుసార్లు నిర్వహించినా, హామీలివ్వడమే తప్ప పనులు చేసిన దాఖలాల్లేవు. నియోజకవర్గాల వారీగా వచ్చిన పనుల్లో అక్కడి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు.
అడుగు ముందుకు పడని వైనం
టెండర్లు పిలిస్తే బయట వారికి ఎక్కడ వస్తుందోననే ఉద్దేశంతో వీటిపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం. రూ.పది లక్షల వరకు నామినేషన్ తెచ్చేందుకు యత్నాలు సాగిస్తుండటంతో మంజూరైన ఏ చిన్న పనీ అడుగు ముందుకుపడటంలేదు. మోంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంతో ఓ అండ్ ఎం, ఎఫ్డీఆర్ పనుల విషయంలో ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు వాస్తవాలను గ్రహించి పనులు పూర్తయ్యేలా సహకరించాలని రైతులు కోరుతున్నారు.
మంజూరైన ఎఫ్డీఆర్ పనుల వివరాలు
నియోజకవర్గం పనులు నిధులు
(రూ.కోట్లలో)
సర్వేపల్లి 316 16.90
నెల్లూరు రూరల్ 165 12.93
నెల్లూరు సిటీ 12 0.78
కోవూరు 368 20
కావలి 292 19.18
ఆత్మకూరు 199 10.31
ఉదయగిరి 150 7.26
వెంకటగిరి 100 6
కందుకూరు 13 0.18
మొత్తం 1615 93.27


