నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఐటీడీఏ పీఓగా బాధ్యతలను శ్రీనివాసరావు గురువారం స్వీకరించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో రీజినల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన్ను డిప్యుటేషన్‌పై ఇక్కడికి బదిలీ చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం
నెల్లూరు రూరల్: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. నెల్లూరు సిటీకి కొండ్రెడ్డి రంగారెడ్డి.. నెల్లూరు రూరల్‌కు చిల్లకూరు సుధీర్‌రెడ్డి.. ఉదయగిరికి కూనం సుధాకర్‌రెడ్డి.. సర్వేపల్లికి వీరి చలపతి.. కోవూరుకు కొండూరు అనిల్.. ఆత్మకూరుకు పేర్నేటి కోటేశ్వరరెడ్డి.. కావలికి కొడవలూరు ధనుంజయరెడ్డి.. కందుకూరుకు పెళ్లకూరు సత్యనారాయణరెడ్డి.. గూడూరుకు బీరేంద్రవర్మ.. సూళ్లూరుపేటకు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు.
జెడ్పీలో నేటి నుంచి
మహిళలకు ఆటల పోటీలు
నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీ ఆవరణలో మహిళలకు ఆటల పోటీలను శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపనున్నామని వెల్లడించారు. 40 ఏళ్లలోపు.. ఆపై వయస్సు గల వారికి రెండు విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. విజేతలకు బహుమతుల ప్రదానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఆదివారం జరపనున్నామని పేర్కొన్నారు. భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి
ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 63,772 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,013 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.1.47 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
ఇంటి పన్నులపై
కార్యదర్శులతో సమీక్ష
సోమశిల: ఇంటి పన్నులపై పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డీపీఓ వసుమతి గురువారం నిర్వహించారు. పన్నుల వసూళ్ల వివరాలను ఆరాతీసిన అనంతరం ఆమె మాట్లాడారు. పన్ను చెలింపులో వెనుకబడిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి నూరు శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం స్థానిక సచివాలయ పరిధిలో పన్ను బకాయిదారుల ఇళ్ల వద్దకెళ్లి సకాలంలో చెల్లించాలని కోరారు. అనంతరం కాకూరివారిపల్లి గ్రామాన్ని జిల్లా మలేరియా నివారణాధికారి మస్తానమ్మతో కలిసి సందర్శించారు. గ్రామంలో విషజ్వరాలు ప్రబలిన తరుణంలో పరిస్థితిని పరిశీలించారు. ఈఓపీఆర్డీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


