● ఆగని మాస్ కాపీయింగ్
నెల్లూరు (టౌన్): న్యాయవిద్య అపహాస్యంగా మారుతోంది. చీటీలతో పరీక్షలు రాస్తూ పదుల సంఖ్యలో విద్యార్థులు డీబారవుతున్నా, మాస్ కాపీయింగ్ ఏ మాత్రం ఆగడం లేదు. పరీక్షలను నిర్వహిస్తున్న వీఆర్‌ఐపీఎస్ కళాశాలలోని టాయ్‌లెట్లలో చీటీలు, పేపర్లు భారీగా గురువారం దర్శనమిచ్చాయి. వాస్తవానికి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే కేంద్రంలోకి అనుమతించాలి. అయితే ప్రస్తుతం ఈ పద్ధతిని అమలు చేయడంలేదు. ఫలితంగా చీటీలు, పుస్తకాలను యథేచ్ఛగా తీసుకొస్తున్నారు. ఫిర్యాదులు అందడంతో వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో 19 మంది, తాజాగా ముగ్గురు గురువారం డీబారయ్యారు. అయినా మాస్ కాపీయింగ్‌కు ఏ మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. తనిఖీలకు వచ్చిన సమయంలో కొంతమంది విద్యార్థులు తమ చీటీలు, స్లిప్పులను టాయ్‌లెట్లలో పడేస్తున్నా రని తెలుస్తోంది. మరికొందరు పరీక్షకు ముందే అక్కడ దాచి వాష్‌రూమ్ పేరు చెప్పి వీటిని చూసొస్తున్నారని సమాచారం. మరోవైపు మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన కొందర్ని విధుల్లో ఉన్న అధికారులు వదిలేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


