నెల్లూరు (టౌన్): నగరంలో లా పరీక్షలను నిర్వహిస్తున్న వీఆర్‌ఐపీఎస్ కళాశాల కేంద్రంలో తనిఖీలను వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సోమవారం చేపట్టారు. ‘న్యాయ విద్య అపహాస్యం’ అనే శీర్షికన సాక్షిలో కథనం గత నెల 28న ప్రచురితమైన తరుణంలో పరీక్షల పారదర్శకత, నాణ్యత ప్రమాణాల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరు, ప్రశ్నపత్రాల పంపిణీ విధానంపై కేంద్ర సూపరింటెండెంట్లతో సమీక్షించారు. అనంతరం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడటం వర్సిటీ బాధ్యత అని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేంద్రాల్లో భద్రత చర్యలను కట్టుదిట్టం చేసి విధులను ప్రతి ఇన్విజిలేటర్ సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.


