కలెక్టర్‌ చొరవ.. వృద్ధురాలికి న్యాయం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ చొరవ.. వృద్ధురాలికి న్యాయం

Mar 3 2026 7:24 AM | Updated on Mar 3 2026 7:24 AM

నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చొరవతో ఓ వృద్ధురాలికి న్యాయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌ 22వ తేదీన కావలికి చెందిన రమాజ్యోతి నడవలేని స్థితిలో నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి కింద కూర్చొన్నారు. హిమాన్షు శుక్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేశారు. ఆమె వద్దకెళ్లి అర్జీ స్వీకరించారు. పెద్దకొడుకు తనను మభ్యపెట్టి ఇంటిని రాయించుకుని బయటకు వెళ్లగొట్టాడని వాపోయింది. తక్షణమే స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులు పిలిచి ఆమెకు వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి ఇంటిని ఆమెకు అప్పగించారు. రమాజ్యోతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. హిమాన్షు శుక్లా విజయవాడకు వెళ్లడంతో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌ను కలిసి స్వీట్లు అందజేశారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

కోవూరు: ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన పాటూరు శ్రీనివాసులు కుమారుడు పవన్‌సాయి (19) గంగవరం గ్రామంలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున అతను ఇంట్లో పురుగు మందు తాగాడు. కొద్దిసేపటికే వాంతులు చేసుకోవడంతో గమనించిన తండ్రి వెంటనే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం పవన్‌ మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా సత్యనారాయణ

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా యు.సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ 1995 బ్యాచ్‌ ఎస్సై. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఎస్సైగా, సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. డీఎస్పీగా సీఐడీలో పనిచేసి ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్నారు. రెండు రోజుల్లో మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

రోడ్డు దాటుతుండగా..

కారు ఢీకొని వృద్ధుడి మృతి

నాయుడుపేట టౌన్‌: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారి కూడలి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం కలగుర్తిపాడు గ్రామానికి చెందిన తీపలపూడి దొరస్వామి (66) సోమవారం బిరదవాడ జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

హోంగార్డ్‌పై దాడి కేసులో డ్రైవర్‌కు ఏడాది జైలు

కోవూరు: విధుల్లో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో దాడికి పాల్పడిన లారీ డ్రైవర్‌కు కోవూరు అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి పి.చైతన్య ఏడాది జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ సంతోష్‌కుమార్‌ రావత్‌ 2019 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కోవూరు సమీపంలోని సాలుచింతల ప్రాంతంలో మద్యం తాగి గొడవ చేశాడు. డ్యూటీలో ఉన్న కోవూరు పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు వడ్డేముక్కల మల్లికార్జున అక్కడికెళ్లి గొడవ చేయవద్దని సంతోష్‌కుమార్‌కు చెప్పాడు. అతను ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న మద్యం బాటిల్‌తో మల్లికార్జున తల, ముక్కుపై బలంగా కొట్టాడు. హోంగార్డుకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సంతోష్‌కుమార్‌కు శిక్ష పడింది. ప్రాసిక్యూషన్‌ తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పూండ్ల బాబు (స్టాలిన్‌) వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement