నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆటోనగర్‌లో ఓ ప్లాస్టిక్ గోదాములో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కథనం మేరకు.. నగరానికి చెందిన పి.పఠాన్ అన్వర్‌ఖాన్ ఆటోనగర్ ఫేజ్ – 1లో ప్లాస్టిక్ గోదాము నిర్వహిస్తున్నాడు. అందులో పెద్దఎత్తున ప్లాస్టిక్ నిల్వలున్నాయి. కొంతకాలంగా దానిని మూసి ఉన్నారు. ఎవరైనా కావాలని చేశారో?, మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు గానీ గోదాములో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో అంతటా వ్యాపించాయి. గోదాములో నుంచి దట్టమైన పొగ రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి వాకా శ్రీనివాసులురెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది అతి కష్టంపై మంటల్ని ఆర్పివేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి నిప్పును నిర్లక్ష్యంగా అక్కడ వేయడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంలో రూ.40 వేల మేర ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని గోదాముకు సమీపంలోని వివిధ షాపుల వారిని అక్కడ్నుంచి దూరంగా పంపారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ప్లాస్టిక్ వేస్టేజ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. వరుస ఘటనల నేపథ్యంలో దుకాణదారులు, గోదాముల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. కాగా ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆరాతీశారు. వార్డు రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు యజమాని నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.


