● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● పోటెత్తిన అర్జీదారులు
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మురళి, డీపీఓ వసుమతి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్య ధోరణి వద్దు
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యల విషయంలో నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ దివ్యాంగ విభాగం నెల్లూరు అధ్యక్షుడు షేక్ సుభాన్‌బాషా, రూరల్ అధ్యక్షుడు సాధు పెంచలరెడ్డి, ఆదెమ్మ అన్నారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఇటీవల త్రీవీలర్ స్కూటీలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రభుత్వం నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారం చేశామని చెప్పారే కానీ పూర్తిగా అవగాహన లేకుండా పోయిందన్నారు. సదరం సర్టిఫికెట్లు దివ్యాంగులకు ఎంతో ముఖ్యమైనవని, ఇలాంటి విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. వీటిపై సంబంధిత మంత్రి వెంటనే సమీక్ష నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.


