● పోలీసులకు వినతిపత్రమిచ్చిన మహిళ
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(క్రైమ్): ‘అదనపుకట్నం కోసం భర్త, అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలి’ అని కోవూరుకు చెందిన వివాహిత కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 143 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్, ఎస్‌బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ. శ్రీనివాసరావు, మహిళా పోలీస్‌స్టేషన్, డీసీఆర్‌బీ, కంట్రోల్ రూమ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, ఎన్.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● గతేడాది డిసెంబర్‌లో నా కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారించి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కొండాపురానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
● వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన దేవిక నా కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని కోవూరుకు చెందిన ఓ మహిళ కోరారు.
● బంగారంలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ కంపెనీకి చెందిన సాయికిరణ్, సుదీప్‌లు నమ్మించారు. దీంతో రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. అప్పట్నుంచి వారు సరిగ్గా స్పందించ లేదు. డబ్బు తిరిగివ్వాలని వారిని కోరగా చంపుతామని బెదిరిస్తున్నారని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.


