● చెరువులో ఈతకెళ్లి యువకుడి మృతి
దగదర్తి: సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో మండలంలోని సున్నపుబట్టి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు మరియు పోలీసుల కథనం మేరకు.. సున్నపుబట్టి గ్రామానికి చెందిన బెల్లంకొండ శీనమ్మ పెద్ద కుమారుడు యశ్వంత్ (19) డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. స్నేహితులందరూ ఈత కొట్టి తిరిగి ఒడ్డుకు చేరుకోగా యశ్వంత్ మాత్రం బయటకు రాలేదు. దీంతో భయాందోళనకు గురైన స్నేహితులు గ్రామంలోని బంధువులకు సమాచారం అందించారు. రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది.
మృతదేహం లభ్యం
సోమవారం ఉదయం నుంచి దగదర్తి పోలీసులు, రెస్క్యూ టీమ్, స్థానిక యువకులు కలిసి చెరువులో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సాయంత్రం యశ్వంత్ మతదేహం లభ్యమైంది కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో తల్లి శీనమ్మ, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని ఎస్సై జంపాని కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.


