కొన్ని ఘటనలు
తెలుగుదేశం పాలనలో బాలికలపై పైశాచికం ఆగడం లేదు. అభంశుభం తెలియని వారిపై మృగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కావలిలో వెలుగు చూసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో బాలికలపై లైంగిక వేధింపులు, దాడుల కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
● ఇంటా.. బయట కొరవడిన భద్రత
● పెరుగుతున్న
వేధింపులు,
లైంగిక దాడులు
● తాజాగా కావలిలో దారుణం
● కోట మండలం అటవీ ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు.
● గూడూరు పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి ప్రయత్నించాడు.
● కావలి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికపై వ్యక్తి లైంగికదాడి చేశాడు.
● కావలిలో స్కూల్ బాలికలపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
● నెల్లూరు నగరంలో ఆరేళ్ల బాలికపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
● ఉదయగిరి నియోజకవర్గంలో ఓ యువకుడు ప్రేమ పేరిట బాలికను గర్భవతిని చేశాడు.
నెల్లూరు(క్రైమ్): బాలికలకు ఇంటా.. బయట రక్షణ కొరవడింది. మానవ రూపంలోని కొందరు మృగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మనుమరాలి వయస్సున్న వారిపై వృద్ధులు అకృత్యాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకులు లైంగిక దాడు లకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులను చిదిమేస్తున్న ఘటనలున్నాయి. రక్తసంబంధీ కులు, దగ్గరి బంధువులు, తెలిసిన వారు అఘాయిత్యాలకు ఒడిగడుతున్న ఘటనలు లేకపోలేదు. జిల్లాలో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. లైంగిక వేధింపులు, దాడులకు గురైన వారిలో అనేకమంది ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పరువు పోతుందని, కొందరు ఇతరులకు తెలిస్తే తమబిడ్డ జీవితం నాశనం అవుతుందని, తలెత్తుకు తిరగలేమని భావించి మరికొందరు మిన్నకుండిపోతున్నారు.
కఠిన చట్టాలున్నా..
పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెన్సెస్ యాక్ట్) చట్టం కఠినమైనది. దీని కింద కేసు నమోదైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక్కోసారి జీవితఖైదు విధించవచ్చు. బాధితుల వయస్సు 18 ఏళ్లలోపు ఉంటే పోక్సో కింద కేసు నమోదు చేస్తారు. ఇంత ఉన్నా కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
తల్లిదండ్రులు పిల్లలతో అధిక సమయం గడపాలి. స్నేహపూర్వకంగా మెలగాలి. వారు ఏ విషయమైనా తమతో పంచుకునేలా తీర్చిదిద్దాలి. రోజువారి కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుంటుండాలి. అపరిచితులు, ఆకతాయిలు ఆట పట్టించినా, అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులు పెట్టినా నేరుగా తమకు చెప్పాలని వారికి భరోసా ఇవ్వాలి. ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన ఆత్మరక్షణ విద్యలు నేర్పాలి. పిల్లలపై అతిగా ప్రేమ చూపిస్తున్నట్లు నటించేవారిపై కన్నేసి ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు, డయల్ 112కు ఫోన్ చేసేలా వారికి సూచించాలి. లైంగిక వేధింపులు, బాలల హక్కుల చట్టాలపై అఽధికారులు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి. బడుల్లో గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌లపై బాలికలకు అవగాహన కల్పించాలి. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా అప్రమత్తం కావాలి? ఎలా ప్రతిఘటించాలనే అంశాలను వివరించాలి.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్


