పోక్సో కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు
● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): పోక్సో కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి చార్జిషీట్‌లు దాఖలు చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులను ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఈ – ఆఫీస్, సీసీటీఎన్‌ఎస్, డిజిటల్ అండ్ సైబర్ ఫోరెన్సిక్, మొబైల్ డేటా అనాలసిస్, సాఫ్ట్‌వేర్ ఆధారిత పోలీసింగ్ టూల్స్, సీసీ టీవీ ఫుటేజ్‌ల విశ్లేషణ, డ్రోన్ టెక్నాలజీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ శాఖకు అందుబాటులో ఉన్న ఈ – ఆఫీస్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రక్రియలను వేగవంతం చేసి పారదర్శకతను పెంపొందించాలన్నారు. డయల్ 112 కాల్స్‌కు సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి ఫీల్డ్ స్థాయి వరకు తక్షణ స్పందన ఉండాలన్నారు. సైబర్ ఫ్రాడ్ కేసుల్లో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన ఎస్‌ఓపీపై సైబర్ వింగ్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


