దొంగనోటిచ్చి.. ఉడాయించి..
బుచ్చిరెడ్డిపాళెం: పేద వృద్ధురాలికి ఓ వ్యక్తి దొంగనోటు ఇచ్చి మోసం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంలో రమణమ్మ అనే వృద్ధురాలు రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం ఎప్పటిలాగే ఆమె వ్యాపారం చేసుకుంటోంది. ఓ వ్యక్తి వినియోగదారుడిలా వచ్చాడు. రూ.100 విలువైన కూరగాయలు తీసుకుని ఆమెకు రూ.200 నోటు ఇచ్చాడు. అది అసలు నోటేనని నమ్మిన రమ ణమ్మ, అతడికి మిగిలిన రూ.100 ఇచ్చింది. అతను వెళ్లిన కాసేపటికి అనుమానంతో రమణమ్మ నోటును నిశితంగా పరిశీలించింది. అది నకిలీదని తెలియడంతో షాక్‌కు గురైంది. అప్పటికే అతను పరారు కావడంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధురాలు లబోదిబోమంది. రోజంతా కష్టపడితే వచ్చే ఆదా యం కాస్తా ఇలా దొంగనోటు రూపంలో ఆవిరైపోవడంతో కన్నీరుమున్నీరైంది.
కండలేరులో 53.960 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 53.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


