గృహ నిర్మాణాలకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణాలకు మోక్షం

Jan 15 2026 1:33 PM | Updated on Jan 15 2026 1:33 PM

గృహ నిర్మాణాలకు మోక్షం

గృహ నిర్మాణాలకు మోక్షం

పేదల గూడును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పొదలకూరు జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను తిరిగి నిర్మించేందుకు విజిలెన్స్‌, థర్డ్‌ పార్టీ నివేదికలు అందాయి. దాని ప్రకారం ఇళ్లను పూర్తి చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

పొదలకూరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద ఊర్లనే నిర్మించి పేదలకు ఇళ్లు అందజేయాలని మూడు ఆప్షన్లను పెట్టి నిర్మాణం చేపట్టింది. జిల్లాలో కావలి తర్వాత పొదలకూరు ప్రభుత్వ లేఅవుట్‌ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణం సొంతంగా నిర్మించుకోలేమని లబ్ధిదారులు సమ్మతిపత్రం అందజేశారు. గృహ నిర్మాణ శాఖ తొలివిడతగా 750 ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇక్కడ మొత్తం 1,400 ప్లాట్లు, ఒక్కొక్కరికి 9 అంకణాల వంతున అందజేయడం జరిగింది. లేఅవుట్లో కాంట్రాక్టర్లు 750 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 572 ఇళ్లకు శ్లాబులు, 268 ఇళ్లకు బేస్‌మట్టాలను పూర్తి చేశారు. పెద్ద లేఅవుట్‌ కావడంతోపాటు ప్లాట్ల నంబర్లు మారిపోవడంతో లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు సుమారు రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. లేఅవుట్లో విద్యుత్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి నిర్మాణాలను చేపట్టారు.

విచారణ చేసి..

లేఅవుట్లో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించాల్సిందిగా విజిలెన్స్‌కు అప్పగించింది. ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు లేఅవుట్‌కు వచ్చి విచారణ చేశారు. ప్లాట్ల నిర్మాణం, ఇళ్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, అర్హులైన వారికి ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై విచారణ నిర్వహించారు. దీంతో పేదల గూడుకు కష్టం వచ్చింది. విచారణ సాగదీత ధోరణలో ఉండటంతో నిర్మాణంలో మరింత జాప్యం జరిగింది. అయితే ఎట్టకేలకు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ద్వారానే రిపేర్లతోపాటు, పూర్తి చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నాలుగు పద్ధతుల్లో..

ఇప్పటి వరకు నిర్మించిన 572 ఇళ్లలో 385 ఇళ్లకు రిపేర్లు చేపడితే వినియోగానికి పనికొస్తాయని థర్డ్‌ పార్టీ నివేదిక సమర్పించింది. ఇందులో భాగంగా క్యూరింగ్‌, క్రాక్స్‌, సాయిల్‌ ఫిల్లింగ్‌, కాంక్రీట్‌ బెడ్‌ పద్ధతుల్లో రిపేర్లు చేయాల్సి ఉంటుంది. నిర్మించిన వాటిలో 187 ఇళ్లు బాగున్నాయని వాటికి ఎలాంటి రిపేర్లు అవసరం లేదని నివేదికలో చెప్పారు. ఇక్కడి ప్రభుత్వ లేఅవుట్లో ఏడు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు ముందుకొచ్చి ఇళ్లను నిర్మించడం జరిగింది. మండలంలోని నేదురుమల్లి, వెలికంటిపాళెం, మహ్మదాపురం గ్రామాల్లో లేఅవుట్లకు సంబంధించి థర్ట్‌ పార్టీ నివేదికలు అధికారులకు అందాల్సి ఉంది.

ఇళ్లను నిర్మిస్తాం

విజిలెన్స్‌, థర్డ్‌ పార్టీ నివేదికలు సమన్వయం చేసుకుని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. పొదలకూరు లేఅవుట్లో ఇళ్ల రిపేర్లతోపాటు, గతంలో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీల చేత పనులు పూర్తి చేయించడం జరుగుతుంది. కాంట్రాక్టర్లు రిపేర్లు చేసేందుకు, మిగిలిన ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చారు.

– మహేష్‌, హౌసింగ్‌ ఏఈ,

పొదలకూరు

విచారణ పేరుతో ఆగిన

పేదల ఇళ్ల నిర్మాణం

కట్టిన వాటికి రిపేర్లు చేస్తే

సరిపోతుందని నివేదిక

187 ఇళ్లకు మరమ్మతులు

అవసరం లేదు

గతంలో నిర్మించినవి

కాంట్రాక్టర్లే పూర్తి చేయాలి

త్వరలో అతిపెద్ద లేఅవుట్లో

పనుల ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement