అగ్నిప్రమాదంలో ఇళ్లు బుగ్గి
పేలిన గ్యాస్ సిలిండర్
● మంటల్లో ఎనిమిది ఇళ్లు
● వీధిన పడిన నిరుపేద కుటుంబాలు
సైదాపురం: అక్కడ నిరుపేద కుటుంబాలు ఉంటున్నాయి. వారికి రోజూ కూలీ పనులకు వెళ్తేనే పూట గడుస్తుంది. భోగి పండగ సందడిలో ఉండగా అగ్నిప్రమాదం జరిగి ఇళ్లన్నీ కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన సైదాపురం మండలంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఊటుకూరు గ్రామ సమీపంలో మిక్స్‌డ్ కాలనీ ఉంది. అక్కడున్న వారంతా కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. కొందరు రేకులు, మరికొందరు పూరిళ్లలో నివాసముంటున్నారు. భోగి పండగను చేసుకుంటున్న సమయంలో ఆ కాలనీకి చెందిన నక్కా ఏడుకొండలు రేకుల ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. మంటలు చెలరేగి చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయి. నక్కా నాగరాజు, నక్కా రమేష్, శైలజ, పొలుగోటి అంకయ్య, కె.వసంత, కుడుముల పోలయ్య, తిరిమలశెట్టి శీనయ్యకు చెందిన ఐదు రేకులు, మూడు పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. కాలనీవాసులు ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. గూడూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఇన్‌చార్జి విజయకుమార్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. రూ.లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెప్పారు. తహసీల్దార్ సుభద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులకు తక్షణ సహాయంగా 10 కేజీల బియ్యంతోపాటు, చాపలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని తెలిపారు.
అగ్నిప్రమాదంలో ఇళ్లు బుగ్గి
అగ్నిప్రమాదంలో ఇళ్లు బుగ్గి


