ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ , ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్‌లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధీ పేరును తట్టుకోలేని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందన్నారు. దాని స్థానంలో వీబీ–జీ–రామ్‌జీ చట్టాన్ని తీసుకురావడం దారుణమన్నారు. జిల్లాలోని 200 గ్రామాల్లో ప్రజలు భోగి మంటల్లో కొత్త చట్టం ప్రతులను వేశారన్నారు. ఈ పథకం ద్వారా 200 రోజుల పనిరోజులు కల్పించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. కొత్త చట్టం ద్వారా వచ్చే ఇబ్బందులపై ఈనెల 18వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ ఉపాధి’ క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నాయకులు గోగుల శ్రీనివాసులు, దయాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


