తమ్ముళ్ల బరి తెగింపు
కోళ్ల పందేలపై హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ టీడీపీ తమ్ముళ్లు బరుల ఏర్పాటుకు బరితెగించారు. సంక్రాంతి సంబరాల ముసుగులో కోడి పందేలతో జూదగాళ్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో అధికార పార్టీ నేతల కోడి పందేల బరులు విచ్చలవిడిగా వెలిశాయి. పోలీసుల కళ్లుగప్పి కాదు.. ‘కళ్లు మూయించి’ సాగుతున్న ఈ తంతు న్యాయ వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.
ముడుపుల మత్తులో ఖాకీలు
కోడి పందేలను నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో సీన్ దానికి పూర్తి భిన్నంగా ఉంది. పోలీసులకు లక్షలాది రూపాయల ముడుపులను నిర్వాహకులు చెల్లించి, వారిని అటువైపు రాకుండా మేనేజ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరినా, వందలాది మంది గుమిగూడినా కానిస్టేబుల్ కాదు కదా కనీసం హోం గార్డు సైతం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుకున్న మర్మమేమిటో అందరికీ అర్థమవుతోంది.
ఆత్మకూరు: సంక్రాంతి వేళ కోడిపందేలను నిర్వహించొద్దంటూ ఆర్డీఓలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టారు. అయితే పోలీస్ వ్యవస్థనే సవాల్ చేస్తూ.. హైకోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం నాగులవెల్లటూరులో కోడి పందేల బరులను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో బరులను నెలకొల్పి రూ.కోట్లల్లో పందేలు ఆడించారు. జిల్లాతో పాటు సమీపంలోని రాయలసీమ జిల్లాల నుంచి వందలాది కార్లు, బైక్‌లలో పందెంరాయుళ్లు వచ్చారంటే ఇక్కడ ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ బరులకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రైవేట్ సైన్యాన్ని పహారా పెట్టి, ఎవరూ సెల్‌ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వచ్చే వారు సెల్‌ఫోన్లలో చిత్రీకరించొద్దని, ఫొటోలు తీయరాదని, స్విచ్ఛాఫ్ చేసుకొని మరీ వెళ్లాలని హెచ్చరించేందుకు, పరిశీలించేందుకు 20 మంది యువకులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారంటే కోడిపందేల నిర్వహణకు ఎంత పకడ్బందీగా సన్నాహాలు చేశారో ఇట్టే అర్థమవుతోంది. ఇదంతా పోలీస్ వ్యవస్థ కళ్లుగప్పి కాదు.. కళ్లు మూయించి ఆడించారనే ఆరోపణలూ లేకపోలేదు.
నిబంధనలు గాలికి..
చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామ శివార్లలోని వాగు పరిసర ప్రాంతం మినీ క్యాసినోను బుధవారం తలపించింది. భోగి పండగ సాక్షిగా ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. స్థానికులే కాకుండా, పక్కనే ఉన్న రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 200కుపైగా కార్లలో సంపన్న జూదగాళ్లు తరలివచ్చారు. కోడి పందేలను హైకోర్టు నిషేధించినా, క్రూరత్వాన్ని అరికట్టాలని ఆదేశించినా.. ముడుపుల విందుల్లో మునిగిపోయి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ మాత్రం కత్తులు కట్టిన కోడి పుంజులు రక్తం చిందిస్తున్నాయి.
ఎస్సై సమాధానం.. విడ్డూరంగా
ఇంత బాహాటంగా పందేలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎస్సై తిరుమలరావును సంప్రదించగా, ఆయన చెప్పిన సమాధానం విస్తుగొలుపుతోంది. తాను గ్రామంలోనే ఉన్నానని, ఎక్కడా పందేలు జరగడంలేదని, కేవలం గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కళ్లెదుటే వందలాది వాహనాలు, వేలాది మంది జూదగాళ్లు కనిపిస్తున్నా.. పోలీసులకు మాత్రం అంతా శాంతియుతంగా కనిపించడం గమనార్హం.
మంత్రి ఆనం ఇలాకా
నాగులవెల్లటూరులో కోడి పందేలు
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్..
చేతులు మారిన రూ.కోట్లు
రాయలసీమ నుంచి క్యూ కట్టిన
వందలాది వాహనాలు
కేంద్రం చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం నుంచే ఆంక్షలు
సెల్‌ఫోన్లపై రెస్ట్రిక్షన్స్..
ప్రైవేట్ సైన్యం పహారా
ఖాకీల ‘ముడుపు’ల విందు


