హోరాహోరీగా ఎడ్ల పోటీలు
కోవూరు: పట్టణంలోని డొంకలో ఎడ్ల పోటీలను కోవూరు బండ్ల సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా బుధవారం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 40 జతల ఎడ్లు హాజరయ్యాయి. కోవూరుకు చెంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు, పక్క రాష్టాల్లో ఉన్న వ్యాపారులు, ఉన్నతోద్యోగుల సహకారంతో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్లకు కప్‌తో పాటు పారితోషికాన్ని అందజేశారు.
మూడు కిలోమీటర్లు.. 4.59 నిమిషాల్లో
ప్రకాశం జిల్లా పమిడిపాడుకు చెందిన అభయాంజనేయస్వామి ఎడ్ల జత మూడు కిలోమీటర్లను 4.59 నిమిషాల్లో చేరుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకూరుపేట మండలంలోని చాముండేశ్వరి సీ ఫుడ్స్‌కు చెందిన ఎడ్ల జట్టు 5.11.. ప్రకాశం జిల్లా పమిడిపాడుకు చెందిన నల్లబోతు సాయి హర్ష ఎడ్ల జట్టు 5.15 నిమిషాల్లో చేరుకొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
నగదు బహుమతుల ప్రదానం
● ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.40 వేలు, కప్‌ను సులోచనమ్మ జ్ఞాపకార్థం భర్త అనపల్లి అశోక్‌కుమార్‌రెడ్డి అందజేశారు.
● ద్వితీయ స్థానం సాధించిన జట్టుకు రూ.25 వేలను జనార్దనం ఆదిశేషాచార్యులు, సరోజనమ్మ జ్ఞాపకార్థం కుమారుడు శ్రీకాంతాచార్యులు ప్రదానం చేశారు. రోల్డ్ కప్‌ను పెద్ది ప్రభావతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు మారుతీ నాగార్జున ఇచ్చారు.
● తృతీయ బహుమతిగా రూ.20 వేలను గాదిరాజు ప్రభాకర్‌రావు, కుమారుడు సురేష్‌బాబు జ్ఞాపకార్థం ఆయన తమ్ముడు గాదిరాజు జీవన్‌కృష్ణ అందజేశారు. రోల్డ్ కప్‌ను రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఇచ్చారు.
● కొడవలూరు మండలం యల్లాయపాళేనికి చెందిన అత్తిరాజు లాస్య ఎడ్లు 5.20 నిమిషాల్లో గమ్యస్థానం చేరాయి. నాలుగో బహుమతిగా రూ.15 వేలను ఇంతా కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం కుమారులు అందజేశారు. వీరికి కప్‌ను వరదయ్య జ్ఞాపకార్థం కుమారుడు కృష్ణచైతన్య కుటుంబసభ్యులు ప్రదానం చేశారు.
● కోవూరు మండలం గంగవరానికి చెందిన తలారి శ్రీలక్ష్మి ఎడ్ల జత 5.37 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకొని ఐదో స్థానంలో నిలిచింది. వీరికి రూ.పది వేలను గడ్డం చిన్నవెంగళ్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు అందజేశారు. కప్‌ను కై లాసం పద్మావతమ్మ జ్ఞాపకార్థం భర్త గోపాల్‌రెడ్డి అందజేశారు .
పోలీసుల పర్యవేక్షణ
పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. వీక్షించేందుకు పలువురు భారీగా తరలివచ్చారు. వేమారెడ్డి వినీత్‌రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఎడ్ల బండ్ల సంఘ నేతలు పొబ్బా మల్లికార్జునరెడ్డి, దేవిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి, తాటిపర్తి విజయకుమార్‌రెడ్డి, అత్తిపల్లి అనూప్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, మల్లారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
గమ్యస్థానాన్ని చేరుకునేందుకు దూసుకెళ్తున్న ఎడ్లు
హోరాహోరీగా ఎడ్ల పోటీలు


