సోమిరెడ్డీ.. జాగ్రత్తగా ఉండు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టం చంద్రబాబు కాగా, జిల్లాకు పట్టిన దరిద్రం సోమిరెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమశిలకు తామెళ్లాలనుకుంటే అనుమతించలేదని, కండలేరుకు పది మందికి మించి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. తాము ప్రజల్లోకి వెళ్తుంటే టీడీపీ నేతలకు వణుకుపుడుతోందని విమర్శించారు. ప్రజలను తరలించాలంటే డ్రైవర్, క్లీనర్ మినహా మరెవరూ రావడంలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల ముఖం చూడాలంటేనే రైతులు ఇష్టపడటం లేదని చెప్పారు. లెక్కలు రాని వారు సైతం చెప్తున్నారని, తనకు చెప్తే మంచి నేర్పరిని పంపుతానని పేర్కొన్నారు. నీ బతుకు గురించి జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. నెల్లూరులోని శ్రీనివాసమహల్‌లో బ్లాక్ టికెట్ల నుంచి పేకాట, డైమండ్ డబ్బా ఆడించిన విషయం నిజం కాదానని ప్రశ్నించారు. అల్లీపురం కేంద్రంగా నకిలీ ఎరువులను ఎవరు తయారు చేసి రైతులకు అంటగట్టారో కూడా తెలుసునన్నారు. క్రీడల శాఖ మంత్రిగా ఉండి క్రికెట్ కిట్లను అమ్ముకున్న ఘన చరిత్ర ఎవరిదని ప్రశ్నించారు. శివాలయ భూములను విక్రయిస్తూ.. గ్రావెల్, ఇసుక, బూడిద ఇలా అన్నింటినీ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ పనుల్లోనూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నీతో పోటీపడే వారెవరూ లేరన్నారు. పండగ సందర్భంగా ఇలా శని ఏమిటని ఎమ్మెల్యే సునీల్ బాధపడుతున్నారన్నారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని ఇంటికి తీసుకెళ్లి కాళ్లు పట్టుకొని టికెట్ సంపాదించిన వారు.. ఎన్నోసార్లు ఓటమిపాలై మొన్న గెలిచిన వ్యక్తి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తనపై విమర్శలు చేస్తే దీటుగా సమాధానం చెప్తానని స్పష్టం చేశారు.


