నెల్లూరు నగర డీఎస్పీగా దీక్ష
నెల్లూరు(క్రైమ్): నగర డీఎస్పీగా ఐపీఎస్ అధికారి దీక్షను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తూ సెలవులో ఉన్న సింధుప్రియను బదిలీ చేసింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీక్ష స్వస్థలం హరియాణాలోని రోహ్‌తక్. ఆమె భర్త ముఖేష్ ఆదాయ పన్ను శా ఖాధికారి. ఈమె 2016లో యూపీఎస్సీ రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా పీఎంఓలో విధులు నిర్వర్తించారు. ఆపై 2018లో సీఎస్‌ఈ, డీఏఎన్‌ఐపీఎస్ రాసి ఢిల్లీలో ఏసీపీగా పనిచేశారు. ఐపీఎస్ లక్ష్యంగా యత్నించారు. 2021లో 208 ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. గుంటూరులో ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ – 1గా పనిచేస్తూ నగర డీఎస్పీగా నియమితులయ్యారు. కాగా ఇక్కడ ఈ హోదాలో ఐపీఎస్‌ను నియమించడం ఇదే తొలిసారి.
శ్రీవారి దర్శనానికి పది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 68,542 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 22,372 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
రెవెన్యూ వసూళ్లు వేగవంతం
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ నందన్ పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ పరిధిలోని ప్రతి భవనం, అపార్ట్‌మెంట్, వ్యాపార, వాణిజ్య భవనాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రూ.పది వేలకుపైగా ఆస్తి పన్ను బకాయి ఉన్న భవన యజమానితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా స్వయంగా తిరుగుతున్నామన్నారు. టీపీఆర్వో వాసుబాబు, అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ ఆఫీసర్లు సమద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు నగర డీఎస్పీగా దీక్ష


